Sunday, April 28, 2024

అయ్యో రైత‌న్న…. నీకెంత క‌ష్టం….

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఆరుగాలం కష్టపడి, పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి పండించిన పంట అమ్ముకునే సమయంలో అన్నదాతలకు అనేక కష్టాలు తెచ్చిపెడుతోంది. కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం శక్తికి మించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలు పెట్టినప్పటికీ, వాతావరణం సహకరించక అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రామాల్లో అధికార యంత్రాంగం చర్యలు మొదలు పెట్టింది తడువుగా.. గత వారం, పది రోజులుగా దంచి కొడుతున్న వడగండ్ల వానలు వ్యవస్థను స్తంబింప జేశాయి. ఒకవైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలకు పొంచివున్న ముప్పుతో రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. అనేక చోట్ల టన్నుల కొద్దీ ధాన్యం నిల్వలు బలమైన ఈదురుగాలుల దాటికి చెల్లాచెదురై తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఈ దెబ్బకు కోలుకోవడం కష్టమేనని ధాన్యం పండించిన రైతులు బోరుమంటున్నారు. మరోవైపు ధాన్యం నిల్వలకు గిడ్డంగులు లేక అధికార యంత్రాంగం అవస్థలు పడుతోంది. ఎంత కష్టమైనా కొనుగోళ్ళు ఆపొద్దని, రైతుకు అండగా నిలువాలని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.

గత ఏడాది కేంద్రం లెవీ కొనుగోళ్ళు అంతంత మాత్రం ఉండడంతో గోదాముల్లో దాదాపు 60 నుంచి 70శాతం బియ్యం నిల్వలు యదావిధిగా ఉన్నాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాల్లో నిల్వ చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. అయినప్పటికీ కొనుగోల్ళ ప్రక్రియ గగనమేనని వాస్తవ పరిస్థితులు తేల్చి చెబుతున్నాయి. ఈ యాసంగిలో కోటి 58 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు అధికారులు. ఆ ప్రకారం ఇప్పుడున్న గోదాములు పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది.

అదే సమయంలో సరిగ్గా ధాన్యం కొనుగోళ్ళ ప్రారంభ సమయంలోనే అకాల వర్షాలు అడ్డుతగలడంతో రైతులు దైర్యం కోల్పోతున్నారు. సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన, ఆవేదన వారిని వెంటాడుతోంది. సుమారు 12 జిల్లాల్లో అకాల వర్షాలకు తడిసి ముద్దయిన ధాన్యం కుప్పలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో 20 రోజుల క్రితం నుంచే రైతులు కోతలు కోసి ధాన్యాన్ని ఆరబెట్టగా, రెండు వారాల నుంచి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో కోతలు మొదలైనా, అవసరం మేరకు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు నానాకష్టాలు పడుతున్నారు. వరి పొలాలు కోతకు వచ్చినా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు- చేయలేదనే కారణంగా చాలామంది రైతులు ఇంకా పంటను కోయలేదు. ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం మార్కెట్లోకి వస్తే సమస్యలు రెట్టింపయ్యే ప్రమాదమూ పొంచి ఉంది. లక్షల ఎకరాల్లో అకాల వర్షం, వడగళ్లతో పొలాల్లోనే పంట నేలకొరిగింది. దీంతో ఎకరా పొలంలో బస్తా వడ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, వరిని కోస్తే కోత మిషన్‌కు పెట్టే ఖర్చు కూడా తమకు వచ్చే అవకాశాలు లేవని జిల్లాల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌లో 7,550 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు- చేయాలని, అవసరమైతే మరిన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టు-కుని పౌరసరఫరాల శాఖ పనిచేస్తోంది. కానీ వాతావరణం సహకరించక పోవడం, ఊహించని విధంగా అకాల వర్షాలు రావడం తదితర కారణాల వల్ల ఇప్పటివరకు కేవలం 15 జిల్లాల్లో 3,858 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు- చేయగలిగారు. ఇప్పటివరకు సుమారు 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయా జిల్లాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరోవైపు అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిసి ముద్దవుతోంది. ఈ కారణంగా గత నాలుగు రోజులుగా కొనుగోళ్లు ఎక్కడికక్కడ స్తంభించాయి. మరిన్ని రోజుల పాటు వర్షసూచన ఉండడంతో మరో వారం ఇదే పరిస్థితి ఉంటు-ందని అధికారులు భావిస్తున్నారు. సుమారు 15 జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కోత కోసి ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. వరి, మొక్కజొన్నతో పాటు నువ్వులు, సజ్జ పంటలు నేలకొరిగి కుల్లిపోతున్నాయి.

- Advertisement -

ధాన్యం దిగుమతి భారమూ రైతులపైనే..
ప్రభుత్వం ఏర్పాటు- చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం దిగుమతి భారం రైతులపైనే పడుతోంది. 40 కిలోల బస్తాకు రూ.22 పెగా రైతులు ఎగుమతి, దిగుమతి చార్జీలు చెల్లిస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నడిచే ధాన్యం కొనుగో లు కేంద్రాలకు తెచ్చిన ధాన్యానికి హమాలీల ఖర్చును రైతులే చెల్లించాలని 2017లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొనుగోలు కేంద్రాలో ఓ వైపు మద్దతు ధర దక్కపోగా, ఎగుమతి, దిగుమతి పేరుతో వసూళ్లు చేపట్టడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 75కిలోల ధాన్యాన్ని బస్తాగా నిర్ణయించారు. కార్మికులకు బరువు తగ్గించాలనే ఉద్దేశంతో 40కిలోలను బస్తాగా ప్రస్తుతం పరిగణిస్తున్నారు. బరువు తగ్గినా చార్జీ మాత్రం ఆలాగే ఉంది. జిల్లాలోని కొన్ని మండలాల్లో రైతులతో సహకార సంఘాలు ఒప్పందం చేసుకొని బస్తాకు రూ.22 నుంచి రూ.27 వరకు హమాలీ చార్జీగా వసూలు చేస్తున్నారు. ఎకరాకు రూ.2వేల వరకు రైతులపై భారం పడుతోంది. 2017 వరకు ప్రభుత్వమే బస్తాకు రూ.5 నుంచి రూ.10.40వరకు హమాలీలకు చెల్లించింది. ఇది భారమవుతుండటంతో ప్రభుత్వం చెల్లించలేక తమపై హమాలీల చార్జీల భారం మోపుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్‌లో దక్కని మద్ధతు ధరలు
వ్యవసాయ మార్కెట్‌లో తేమశాతం పేరుతో రైతులకు వ్యాపారులు మద్దతు ధర చెల్లించడంలేదు. సీజన్‌లో కొనుగోలు కేంద్రాలకు, వ్యవసాయ మార్కెట్‌ యార్డులకు నిత్యం అత్యధికం ధాన్యం వస్తుండటం వ్యాపారులకు వరంగా మారింది. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని వ్యాపారులు ధర తగ్గిస్తుండగా, అధి కారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రతినిత్యం ఒక్కో వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సరాసరిగా 50 వేల నుంచి 80వేల బస్తాలకు పైగా ధాన్యం వచ్చి పడుతోంది. ప్రభుత్వ మద్దతు ప్రతి క్వింటాలుకు ధర రూ.2060 ఉండగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో గరిష్టంగా రూ.1,700కు మించడం లేదు. ధాన్యం నాణ్యతను బట్టి మద్దతు ధర చాలా తక్కువ మంది రైతులకే లభిస్తోంది.

పండిన ప్రతి గింజనూ కొంటాం : ప్రభుత్వం భరోసా
అకాల వర్షాలు, స్తంభించిన కొనుగోళ్ళ నేపథ్యంలో తీవ్రమైన ఆందోళన చెందుతున్న రైతాంగానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని అధికార యంత్రాంగం ద్వారా వారిలో దైర్యం నింపే ప్రయత్నం చేస్తోంది. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద ఈ విషయాన్ని బ్యానర్ల ద్వారా ప్రకటిస్తున్నారు. అకాల వర్షంతో రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాల్లో తీవ్రమైన పంట నష్టం జరిగింది. మెదక్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో నష్టం తీవ్రత కాస్త ఎక్కువగానే ఉన్నట్లు స్థానిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వాదేశాలతో రెవెన్యూ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టు-కొనే ప్రక్రియ కొనసాగెతోంది. అవసరమైన మేర టార్పాలిన్లు, తేమ మిషన్లను ఏర్పాటు- చేస్తున్నారు. తడిసిన ధాన్యం ఆరిన వెంటనే కొనుగోలు చేస్తామన్న హామీ ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement