Friday, April 26, 2024

వీఆర్ఓ భూ ఆక్రమణ.. పంటకు నిప్పు పెట్టి రైతులు నిరసన

ఆరుగాలం కష్టించి పండించిన పంటను తరలించేందుకు దారి లేకపోవడంతో గుండె మండి రైతులు పంటకు నిప్పు పెట్టారు. పంట పొలాలకు వెళ్లేందుకు రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటుచేసిన దారిని వీఆర్వో ఆక్రమించుకోవడంపై రైతులు ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ ఘటన   మంగళవారం వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామంలో చోటు చేసుకుంది.

బాధిత రైతులు ఎద్దు మల్లేష్, కుమారస్వామి లు మాట్లాడుతూ…మండలంలోని వెలికట్ట శివారులో 596, 609 సర్వే నెంబర్లలో గ్రామం నుండి నాంచారి మడూరు గ్రామం వరకు 33 ఫీట్ల బండ్ల దారిని రెవెన్యూ అధికారులు కొన్నేళ్ళ క్రితం ఏర్పాటు చేశారన్నారు. దాన్ని ఆనుకొని వ్యవసాయ భూమిని కలిగి ఉన్న వీఆర్వో ప్రతి కంఠం భాస్కర్ రాజు సదరు బండ్ల బాటను ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. దాదాపు 12 గుంటల భూమిని అక్రమంగా స్వాధీనపరచుకొని,  రైతులు ఎవరిని ఆ దారి గుండా వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. గతంలో ఈ దారిని ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేసేందుకు తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఈ భూమి బండ్ల దారేనని రెవెన్యూ అధికారులు గతంలోనే తేల్చారని, గ్రామ పంచాయతీ సైతం అదే విషయాన్ని ధ్రువీకరించారని తెలిపారు. 2018 నుంచి వివాదం కొనసాగుతుండడంతో రైతుల అభ్యర్థన మేరకు రెవెన్యూ సర్వేయర్ కొలిచి హద్దులు నిర్ణయించారని తెలిపారు. ఈ విషయమై తహసిల్దార్ సైతం ఎంపీడీవోకు లేఖ రాశాడని గుర్తు చేశారు.

పండించిన పంటను తరలించేందుకు దారి లేకపోవడం తో ఇబ్బంది పడుతున్నామని, దారి లేకపోతే ధాన్యాన్ని ఎలా తీసుకెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. విఆర్వో భాస్కర్ రాజు భూ ఆక్రమణపై  తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినా.. దాటవేత ధోరణి తో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బంది పడుతున్నామన్నారు. ఆ విషయం తెలిపేందుకే ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపామన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ చొరవ చూపి న్యాయం చేయాలని బాధిత రైతులు వేడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement