Friday, April 26, 2024

ఉప ఎన్నిక వస్తుందనే కేసీఆర్ వరాలు: ఈటల

హుజురాబాద్ లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ధర్మానికి అధర్మానికి జరుగబోయే యుద్ధంలో తననే గెలిపిస్తారని తెలిపారు. ఉప ఎన్నిక వ‌స్తుందంటే సీఎం కేసీఆర్ వ‌రాలు ప్ర‌క‌టిస్తారని విమర్శించారు. అధికారంలో ఉన్న లేకున్న..తాను ప్ర‌జ‌ల హృద‌యాల్లో చోటు సంపాదించుకున్నానని చెప్పారు. రాజీనామా త‌ర్వాత ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌ను తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గంలో తెల్ల రేష‌న్ కార్డులు, పింఛ‌న్ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2018 ఎన్నిక‌ల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని హామీ ఏమందని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో మీకు ఓట్లు కావాలి కాబ‌ట్టి ఇప్ప‌టికైనా నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు.

రాష్ట్రంలో ఎప్పుడు ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా ఆ ని‌యోజక వ‌ర్గాల్లో వ‌రాల జ‌ల్లు కురిపించే అల‌వాటు సీఎం కేసీఆర్ ఉందన్నారు. కాబ‌ట్టి హుజురాబాద్ నియోజ‌కవ‌ర్గంలో కూడా మూల‌న ప‌డ్డ ప‌నులు జ‌రిగేలా నిధులు విడుద‌ల చేయాల‌ని తాను కోరుతున్నానని ఈట‌ల డిమాండ్ చేశారు. గొర్రెల మంద మీద తోడేళ్లు ప‌డ్డ‌ట్లు టీఆర్ఎస్ ప్ర‌వ‌ర్తిస్తోందని మండిపడ్డారు. ఎన్న‌డూ హుజూరాబాద్‌కు సాయం చేయ‌లేదని, ఇప్పుడు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుందని చాలా మంది ప్ర‌భుత్వ‌ పెద్ద‌లు ఇక్క‌డికి వ‌స్తున్నారని విమర్శించారు. 19 ఏళ్లుగా న‌న్ను ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నారని తెలిపారు. ఇక్క‌డ కుటుంబ స‌భ్యులుగా బ‌తికిన మ‌మ్మ‌ల్ని విడ‌దీయాల‌ని చూస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో కొంద‌రు చెంచాగాళ్ల‌ను పెట్టుకుని దొంగ దెబ్బ కొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇక్క‌డ జరిగే ఉప ఎన్నికలో హుజూరాబాద్ ప్ర‌జ‌లే  గెలుస్తారని ఈటల చెప్పారు.

ఇదీ చదవండి: హుజురాబాద్ మరో దుబ్బాక కానుందా?

Advertisement

తాజా వార్తలు

Advertisement