Thursday, May 2, 2024

హుజురాబాద్ మరో దుబ్బాక కానుందా?

తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఓ సంచలనం. భూకబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన తర్వాత ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల.. ఇక దూకుడు పెంచారు. హుజురాబాద్ కేంద్రంగా బల ప్రదర్శనకు సిద్ధమైయ్యారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారనే సంకేతాన్ని టీఆర్ఎస్ పార్టీకి పంపిస్తున్నారు. అందులో భాగంగా భారీ రోడ్ షోను నిర్వహించారు. ఈటలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. తన రాజీనామాతో జరిగే ఉపఎన్నికలో టీఆర్ఎస్ ను చిత్తు చేయాలని ఈటల భావిస్తున్నారు. ప్రజలు మద్దతు తనకే ఉందనే సిగ్నల్ ను గులాబీ బాస్ కు పంపుతున్నారు.

మాజీమంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కు పెట్ట‌ని కోట‌గా హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఉంది. ఇప్పటికే ఆరుసార్లు ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. నియోజవకర్గంలో ఈటలను ఏకాకిని చేయాలని భావించిన టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయనే చెప్పాలి. ఈటల వెంట క్యాడర్ వెళ్లకుండా కట్టడి చేశామనే ధీమాలో ఉండగా.. టీఆర్ఎస్ నేతలు నిర్వహించిన సమావేశాల్లో ‘జై ఈటల’ అంటూ నినాదాలు వినిపించడం షాక్ కు గురిచేసింది.

ఇక, నియోజకవర్గంలో టీఆర్ఎస్ ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీష్ రావుతో పాటు స్థానిక జిల్లా మంత్రి గంగుల హుజురాబాద్ నాయకులతో రెగ్యూల‌ర్ గా భేటీ అవుతున్నారు. న‌యానో బ‌యానో పార్టీలోనే ఉండేట్లుగా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. కాద‌ని ఎదురు తిరిగితే కేసుల పేరు బెదిరింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్ లో ఇప్ప‌టికే 50కోట్లు ఖ‌ర్చు చేశార‌ని, అధికారాన్ని అడ్డంపెట్టుకొని… క‌మ‌లాపురాన్ని క‌బ్జా చేస్తున్నార‌ని ఈటల మండిప‌డ్డారు. హ‌రీష్ మ‌న‌సుకు అన్నీ తెలుస‌ని, అక్క‌డి ప్ర‌జ‌ల‌నే న‌మ్ముకున్నాన‌ని ఈట‌ల సెంటిమెంట్ తో కొట్టారు.

ఈ క్రమంలో ఎన్ని ఆశ‌లు చూపినా, బెదిరించినా కొంద‌రు నేత‌లు ఈట‌ల‌ వెంటే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్ప‌టికే వీణ‌వంక మండ‌లానికి చెందిన ఎంపీపీ, ప‌లువురు స‌ర్పంచ్ లు, ఇత‌ర నాయ‌కులు ఈట‌ల వెంట సాగాల‌ని నిర్ణ‌యించారు. ఈటలకు అనుకూలంగా మండ‌లంలో భారీ ర్యాలీ కూడా నిర్వ‌హించారు. దీంతో ఈట‌ల కూడా నియోజ‌క‌వ‌ర్గానికి మ‌కాం మార్చారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు గ్రామాలు, మండ‌లాల్లో ప‌ర్య‌టిస్తుండ‌టంతో… గ‌తంలో టీఆర్ఎస్ లో త‌నతో న‌డిచిన నేత‌లంతా ఒక్కొక్క‌రుగా తిరిగి ఈట‌ల వైపుకు వ‌స్తున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. హుజురాబాద్ తమ చేతి నుంచి జారిపోతుందా ? అనే భయం ఆపార్టీ నాయకులను వెంటాడుతోందని టాక్ వినిపిస్తోంది.

ఇన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్ తో అన్ని ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక పెద్ద దెబ్బ కొట్టింది. దుబ్బాక ఫలితమే హుజురాబాద్ లోనూ రిపిట్ అయ్యే ఛాన్స్ ఉంది. దుబ్బాకలో రఘునందన్ కు ఉన్న సానుభూతిలో గెలిచారు. ఇప్పుడు హుజురాబాద్ లోనూ ఈటలకు సానుభూతి పెరిగింది. ఉద్యమ నేత అయిన తనకు అన్యాయం జరిగిందని, తన ఆత్మగౌవరం మీద దెబ్బ కొట్టారనే ప్రచారాన్ని ఈటల ప్రజల్లో తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు తన సత్తా ఏంటో ఈటల చూపించబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement