Saturday, April 27, 2024

Election – పార్ల‌మెంట్‌ పిలుస్తోంది!బ‌రిలో 15 మంది మాజీ సీఎంలు

(ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్‌, స్పెష‌ల్ డెస్క్‌):లోక్‌సభ ఎన్నికల్లో 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీఏ నుంచి, ముగ్గురు ఇండియా కూట‌మి నుంచి బరిలో నిలువనున్నారు. ఇందులో 6,122 రోజులపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దగ్గరి నుంచి ఒక్క రోజు ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన జగదాంబికా పాల్‌ వరకూ ఉన్నారు. పదవులను వదులుకుని..వీరిలో చౌహాన్‌, సర్బానంద సోనోవాల్‌ మధ్యప్రదేశ్‌, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో భాజపాను విజయ పథంలో నడిపించిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం పదవులను త్యాగం చేశారు. త్రిపుర ముఖ్యమంత్రిగా బిప్లవ్‌ దేవ్‌, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్‌ రావత్‌, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్థానిక వ్యతిరేకత, స్వపక్షంలో అసమ్మతి కారణంగా పదవులను వదులుకుని స్వరాష్ట్ర రాజకీయాల నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా అర్జున్‌ ముండా, ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రాజ్‌నాథ్‌సింగ్‌ సభలో మెజారిటీని నిరూపించుకోలేకపోవడంతో వారి అనంతరం ఆ రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రులుగా పని చేసిన జగదీష్‌ శెట్టర్‌, బసవరాజ్‌ బొమ్మైలు తమ హయాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించలేక పదవులను కోల్పోయారు. రాష్ట్ర విభజనతో…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్‌పార్టీతోపాటు, ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని బయటికెళ్లిపోయారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలు కావడంతో ఆయన 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం 2023 ఏప్రిల్‌లో భాజపాలో చేరారు.కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రులుగా చేసిన దిగ్విజయ్‌ సింగ్‌, భూపేశ్‌ బఘేల్‌లదీ అదే పరిస్థితి. అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నబంతుకి కూడా మెజారిటీ నిరూపించుకోలేకపోయారు. ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చింది. రెండోసారి 2016 జులై 13 నుంచి 16 వరకూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెమా ఖండూ నేతృత్వంలో 43 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి భాజపా అనుబంధంగా ఉన్న పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌గా మారడంతో నబంతుకి పదవి కోల్పోయారు. రాష్ట్రంలో పెమాఖండు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రస్తుతం సర్బానంద సోనోవాల్‌, బిప్లబ్‌ కుమార్‌ దేవ్‌, దిగ్విజయ్‌సింగ్‌ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ వారి పార్టీ అధిష్ఠానాలు.. స్థానిక అవసరాల రీత్యా లోక్‌సభ బరిలోకి దింపాయి. రాజ్‌నాథ్‌ సింగ్‌, జగదాంబికా పాల్‌, అర్జున్‌ ముండా ప్రస్తుతం లోక్‌సభ సభ్యులుగా ఉంటూ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మిగిలినవారంతా కొత్తగా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు.కర్ణాట‌క నుంచి కుమార‌స్వామి..మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ కుమారుడైన హెచ్‌డీ కుమారస్వామి ఒకసారి భాజపా, ఒకసారి కాంగ్రెస్‌ మద్దతుతో కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం 2007లో భాజపాకు అధికారం బదలాయించాల్సిన సమయంలో ఆయన తిరస్కరించి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో స్వల్పకాలం రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. 2018లో ఆయన నేతృత్వంలోని జేడీఎస్‌ మూడో పార్టీగా నిలిచినప్పటికీ భాజపాను అధికారానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌ మద్దతు పలకడంతో ఆయన రెండోసారి అధికార బాధ్యతలు చేపట్టారు. 2019 జులైలో 13 మంది కాంగ్రెస్‌, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో మెజారిటీ కోల్పోయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన పదవి నుంచి వైదొలిగిన రెండుసార్లూ వెంటనే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ గ్రాఫ్‌ పడిపోవడంతో రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ గత ఏడాది సెప్టెంబరులో ఎన్డీయే కూటమిలో చేరింది. ప్రస్తుతం పొత్తుల్లో భాగంగా మూడు స్థానాల్లో పోటీ చేయనుంది. అందులో కుమారస్వామి మండ్య నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దీనివల్ల సిట్టింగ్‌ ఎంపీ, సీనియర్‌ సినీ నటి సుమలత అక్కడి నుంచి భాజపా తరఫున పోటీ చేసే అవకాశం కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement