Sunday, May 12, 2024

ఈటల స్కెచ్ మామూలుగా లేదు… గులాబీ పార్టీ క్లిన్ బోల్డ్!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ కార్యచరణపై సర్వత్ర చర్చ జరుగుతోంది. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు రావడంతో ఈటల రాజేందర్‌ ను ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈటల ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా తన రాజకీయ భవిష్యత్‌‌పై ప్రణాళికలు రచిస్తున్నారు. కొత్త పార్టీని స్థాపించాలా? లేదంటే మరో పార్టీలో చేరాలా? అనే అంశంపై అనుచరులు, మద్దతుదారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నిర్ణయంపై ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టీఆర్ఎస్‌కు దాదాపుగా దూరమైన మాజీమంత్రి ఈటల రాజేందర్.. త్వరలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఈటల పలు ఇంటర్వ్యూల్లో స్పష్టంగా చెప్పారు. ఈటల తన ఎమ్మెల్యేపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో టీఆర్ఎస్.. హుజూరాబాద్‌లో ఆయనను ఓడించేందుకు వ్యూహాలు కూడా రచిస్తోంది. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్‌ తో పాటు పలువురు నేతలు హుజూరాబాద్ టీఆర్ఎస్ నేతలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. ఈటలను ఒంటరి చేయాలని ప్లాన్ చేశారు. ఉప ఎన్నిక జరిగితే హుజురాబాద్‌ను టీఆర్ఎస్ సొంతం చేసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తుంటే.. తన సీటును ఎలాగైనా మళ్లీ తానే గెలుచుకోవాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈటల.. పలువురు రాజకీయ నేతలతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నేతలను కలిసిన ఈటల.. తాజా రాజకీయ అంశాలపై చర్చించారు.

మాజీ ఎంపీ కొండా విశ్వేశర్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, బీజేపీ ఎంపీ అరవింద్, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తదితరులతో ఈటల భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనకు ఆయా పార్టీలు మద్దతు ఇచ్చే విధంగా ఈటల ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఈటలకు సానుభూతి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అనే విధంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీ చేయకుండా ఉండేలా చేయాలని ఈటల యోచిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్న ఈటల రాజేందర్‌కు ఆ రెండు పార్టీలు మద్దతు ఇస్తాయా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. గత పది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీల నేతలతో ఈటల వరుసగా భేటీ కావడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement