Tuesday, May 7, 2024

సీఎం హేమంత్‌ సొరెన్‌పై అనర్హత ?.. గవర్నర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు

జార్ఖండ్ సీఎం హేమంత్‌ సొరెన్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర గవర్నర్‌ రమేష్‌బయీస్‌కు అభిప్రాయం వెల్లడించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హేమంత్‌ సొరెన్‌ తనకు తానే మైనింగ్‌ను కేటాయించుకుని ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని మాజీ సీఎం, బీజేపీ నేత రఘుబర్‌దాస్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ ఆధీనంలోనే గనుల మంత్రిత్వ శాఖ సైతం ఉంది. అయితే, సీఎం సొరెన్‌ తన పేరు మీద స్టోన్‌ చిప్స్‌ మైనింగ్‌ లీజును కేటాయించుకోవడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు మాజీ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ కాంట్రాక్టులను వివరించే ప్రజా ప్రాతినిధ్య యాక్ట్‌, 1951లోని సెక్షన్‌ 9ఏ ను ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌ ఉల్లంఘించినట్లు పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్‌ ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరారు. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరెన్‌ అధికార దుర్వినియోగం చేశారని, ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా ఎన్నికల సంఘం అభిప్రాయపడినట్లు సమాచారం.

కేంద్ర ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని సీల్డ్‌ కవర్‌లో జార్ఖండ్‌ రాజ్‌భవన్‌కు గురువారం ఉదయం పంపినట్లు అధికారిక సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన అభిప్రాయాన్నిగవర్నర్‌ పోల్‌ ప్యానెల్‌కు పంపనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 192 ప్రకారం, శాసనసభ్యులపై అనర్హత అంశం పరిశీలనకు వచ్చినప్పుడు తుది నిర్ణయం గవర్నర్‌ది మాత్రమే. అనర్హత నిర్ణయం తీసుకోవడానికి ముందు గవర్నర్‌ కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం కోరతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement