Friday, April 26, 2024

సరిహద్దులో చైనా రోబో ఆర్మీ.. చలికి తట్టుకోని డ్రాగన్‌ సైనికులు

లడఖ్‌లో భారత్‌ సరిహద్దు అవతలి పక్క చైనా తన సైనికులను ఇప్పటికే మోహరించింది. చలి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ పన్నాగం పన్నింది. చైనా సైనికులు చలిని తట్టుకోలేరు. దీంతో తన రోబో ఆర్మీని రంగంలోకి దింపింది. మానవ రహిత వాహనాలను భారత్‌ సైన్యానికి ఎదురుగా నిలబెట్టింది. టిబెట్‌, లడఖ్‌ సరిహద్దులో చైనా డజన్ల కొద్దీ ఆటోమేటిక్‌, రోబోటిక్‌ వాహనాలను మోహరించింది. ఇటీవల భారత్‌ సైన్యంతో జరిగిన ఎదురుకాల్పుల్లో చలి కారణంగా చైనా సైనికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తరువాత మంచు ప్రాంతాల యుద్ధానికి చైనా సైన్యం పూర్తిగా సిద్ధంగా లేదని తేలింది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ టిబెట్‌లో 88 ఆటోమేటిక్‌ షార్ప్‌ క్లా వాహనాలను మోహరించింది.

ఇందులో లడఖ్‌ సరిహద్దులో 38 పదునైన పంజా వాహనాలను దింపింది. ఈ వాహనాలను చైనా ఆయుధ తయారీ సంస్థ నోరింకో తయారు చేసింది. ఇవి ఆ ప్రాంతంపై నిఘాతో పాటు ఆయుధాలు, నిత్యవసర వస్తువుల సరఫరాలో సహాయం చేస్తాయి. ది ముల్‌ 200 పేరిట పిలిచే మరో మానవ రహిత వాహనం కూడా టిబెట్‌కు చేరుకుంది. ఇలా మొత్తం 120 వాహనాలను దింపింది. వీటిలో చాలా వరకు వాస్తవాధీన రేఖ వద్దకు చేరుకున్నాయి. ఈ వాహనాలకు అదనంగా 70 వీపీ-22 వాహనాలను, 150 ఎల్‌వైఎన్‌ఎక్స్‌ వాహనాలను కూడా పంపింది. ఎల్‌వైఎన్‌ఎక్స్‌పై శతఘ్నులు, భారీ మెషిన్‌ గన్‌లు, మోర్టార్లు, చిన్న క్షిపణి లాంచర్లు అమర్చొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement