Wednesday, May 15, 2024

బిఆర్ఎస్ ‘మ‌హా’ దూకుడు …నేడు ఔరంగ‌బాద్ లో భారీ బ‌హిరంగ స‌భ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మరాఠ్వాడలో బీఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది. వరుస బహిరంగ సభలతో జోరు మీదుంది. నాందేడ్‌, కాందార్‌ లోహా తరహాలోనే ఔరంగబాద్‌ సైతం గులాబీ మయంగా మారింది. మహారాష్ట్ర వాసులకు ఆయువు పట్టు అయిన ఔరంగబాద్‌లో సోమవారంనాడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఛత్రపతి శంభాజీనగర్‌లోని జబిందా మైదానంలో లక్ష మందికి పైగా ప్రజలతో సభను ఏర్పాటు చేసింది. జబిందా దారులన్ని గులాబీ తోరణాలతో కలర్‌ ఫుల్‌గా మారాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారిన తర్వాత తెలంగాణ వెలుపల నిర్వహించిన రెండు బహిరంగ సభలు కూడా మహారాష్ట్రలోనే నిర్వహించారు. నాందేడ్‌, కాందార్‌ లోహా సభలు సక్సెస్‌ అవ్వడంతో ఇప్పుడు ఔరంగబాద్‌లోనూ గులాబీ జెండా పాతేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఔరంగబాద్‌ జిల్లాతో పాటు మిగతా నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ లీడర్లు, ప్రముఖ నేతలు గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. నిత్యం చేరికల పర్వం కొనసాగుతోంది. ఇవాళ జబిందా సభలోనూ సీఎం కేసీఆర్‌ సమక్షంలో పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు.

బీఆర్‌ఎస్‌కు అనుకూల పవనాలు
మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ శూన్యతను బీఆర్‌ఎస్‌ భర్తీ చేస్తుందన్న ఆశలు చిగురిస్తున్నట్లు అక్కడి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పటి హైదరాబాద్‌ స్టేట్‌ మూలాలున్న ప్రాంతాలు కావడంతో మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. పాత బంధాలను పలకరిస్తూ పల్లెలు, పట్టణాలను కదిలిస్తూ గులాబీ పార్టీ ముందుకు వెళ్తోంది. వెనకబాటుతననానికి కారణాలను స్పష్టం చేస్తూనే తెలంగాణ మోడల్‌ను ప్రజలకు వివరిస్తుంది. ఇప్పటికే నిర్వహించిన రెండు బహిరంగ సభలు అక్కడి ప్రభుత్వాల్లో చలనాలను తీసుకువచ్చాయని స్పష్టం చేస్తున్నారు. తమ సభలను చూసి పార్టీలు వణుకుతున్నాయని బీఆర్‌ఎస్‌ నేతలు తెలుపుతున్నారు. అందుకే ఔరంగబాద్‌ సభకు ఆటంకాలు సృష్టించాలని చూస్తున్నారని చెబుతున్నారు. మొదట సభకు అనుమతించి ఏర్పాట్లు మొదలు పెట్టిన తర్వాత పోలీసులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో వేదికను మరొక చోటుకు మార్చారు.

ఆ 8 జిల్లాలే టార్గెట్‌
మరాఠ్వాడ ప్రాంతానికి తెలంగాణతో సాంస్కృతిక అనుబంధం కలిగి ఉంది. తెలంగాణ సరిహద్దు కలిగిన మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు ముంబై కంటే హైదరాబాద్‌ వచ్చేందుకే ఆసక్తిని చూపిస్తారు. తెలంగాణ వారితో కుటుంబ సంబంధాలు, బంధుత్వాలు, ఆర్థిక లావాదేవీలతో పాటు రాకపోకలు ఉంటాయి. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణకు తొలి విడతలో తన ఫోకస్‌ను ఈ ప్రాంతాలపైనే పెట్టింది. నాందేడ్‌, కాందార్‌ లోహ సభలు జరిగిన ప్రదేశాలతో పాటు ఔరంగబాద్‌ ఏరియాలో మొత్తం 54 అసెంబ్లిd, 8 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఔరంగబాద్‌, బీడ్‌, హింగోలి, జాల్నా, నాందేడ్‌, పర్భని, ధారశివ్‌ 8 జిల్లాలు ఉండగా.. తెలంగాణ మూలాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అప్పట్లో ప్రయత్నించారు. మొట్టమొదటి సారి పరిషత్‌ ఎన్నికలతోనే రంగంలోకి దిగింది. తొలి ఎన్నికల్లోనే నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకొని సత్తా చాటింది. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు బీఆర్‌ఎస్‌ మహారాష్ట్రలో అమలు చేస్తోంది. పార్టీ పునాది గ్రామ స్థాయి నుంచి ఉండాలని మరాఠ్వాడలో ప్రయత్నిస్తోంది. పల్లె పల్లెను కదిలించే విధంగా చేరికలను ప్రోత్సహిస్తుంది. చిన్న, పెద్ద లీడర్లతో సహా అందరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ కారు జోరును పెంచుతోంది. స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది. తెలంగాణ పథకాలపై వీడియో స్క్రీన్‌ ద్వారా మరాఠా వాసులకు వివరిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ స్థానికులను తన వైపు తిప్పుకోంటోంది.

రాజకీయ శూన్యతతో బీఆర్‌ఎస్‌కు అవకాశం
మహారాష్ట్రలో పాలన పార్టీల గ్రూప్‌ రాజకీయాలుగా మారిపోయింది. శివసేన చీలిపోవడం, ఎన్సీపీ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తుండటం, కాంగ్రెస్‌ ప్రభావం తగ్గిపోతూ వస్తున్నదని ప్రజలు భావిస్తున్నారు. బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు ఎప్పకటిప్పుడు గ్రహిస్తూ వస్తున్నారని బీఆర్‌ఎస్‌ స్పష్టం చేస్తోంది. ఇన్నీ రాజకీయ పరిణామాల మధ్య విసిగిపోయిన ప్రజలు ఆశా దీపంలా గులాబీ పార్టీని చూస్తున్నట్లు తెలుపుతున్నారు. తెలంగాణ లాంటి పథకాలు వస్తే తమ బతుకులు బాగుపడతాయని రైతులు భావిస్తున్నట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగానికి భారీ ఎత్తున నిధులను సీఎం కేసీఆర్‌ కేటాయించి ఆదుకుంటున్నట్లుగా తమకు కావాలని ఆశిస్తున్నారన్నారు. తమ బతుకులు మారాలంటే బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

- Advertisement -

కమళనాథులకు కౌంటర్‌
సీఎం కేసీఆర్‌ ఔరంగబాద్‌ బహిరంగ సభలో విమర్శల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయి. కేంద్రాన్ని, మహారాష్ట్రలో పాలన తీరును కడిగేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితికి కారణం బీజేపీ అనే విధంగా విమర్శలు చేయబోతున్నారు. రైతుల పొట్ట గొట్టి కార్పొరేట్‌కు దోచి పెడుతున్నదని ఇప్పటికే పలు వేదికల్లో కేసీఆర్‌ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో అన్నదాతలు ఆగం కాకుండా ఉండాలి అంటే దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడాల్సేందే అన్న రీతిలో మాట్లాడనున్నారు. బీజేపీ నేతలకు గట్టి కౌంటర్‌ కూడా ఈ వేదికగా ఇవ్వబోతున్నారు. తెలంగాణ పథకాలను పేరు మార్చి అమలు చేస్తున్న కమలనాథులకు ఔరంగబాద్‌ సాక్షిగా శివాజీ వారసత్వాన్ని గుర్తు చేయనున్నారు. చత్రపతి శివాజీ పేరును వాడుకుంటూ బీజేపీ అవమానిస్తుందన్న సంకేతాలను సైతం మరాఠా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement