Thursday, May 9, 2024

Bengaluru | కాంగ్రెస్​ విజయోత్సవ వేళ.. బెంగళూరులో బీజేపీ కార్యకర్త మర్డర్​

బెంగళూరు శివారు హోస్కోట్ తాలూకాలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ వేడుకల సందర్భంగా ఈ దారుణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతల సమాచారం ప్రకారం.. మరణించిన కృష్ణప్ప (56) ఆ పార్టీ కార్యకర్తలలో ఒకరని తెలుస్తోంది. బెంగళూరు రూరల్ పోలీస్ పరిధిలోని డి సెట్టిహళ్లి గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా,  ఈ హత్య కేసులో ఆదిత్య (21) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ప్రధాన నిందితుడు ఆదిత్య, హత్యకు గురైన కృష్ణప్పకు మేనల్లుడని పోలీసు వర్గాలు తెలిపాయి. కృష్ణప్పకు, అతని సోదరుడు గణేష్‌కు గతంలో తగాదాలున్నాయి. కొన్ని సివిల్ వివాదాలు కూడా ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటుండగా కృష్ణప్ప ఇంటి ముందు నిందితులు పటాకులు పేల్చడంతో వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో క్షణికావేశంలో కృష్ణప్పను గొడ్డలితో నరికివేయగా, అతడికి సహాయంగా వచ్చిన భార్య, కొడుకుపై దాడి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బాధితులు ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ కేసులో మరో నిందితుడు గణేష్ పరారీలో ఉన్నాడని, అతనితో పాటు ఇతరులను పట్టుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

ఈ హత్యను ఖండిస్తూ, బీజేపీ కర్నాటక యూనిట్ ఇలా ట్వీట్ చేసింది: “@INCKarnataka ఇప్పటికే సంయమనం కోల్పోయింది, హోస్కోట్‌లో జరిగిన విజయోత్సవ వేడుకలో మా కార్యకర్త ఒకరు చంపబడ్డారు. రాబోయే ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతల పరిస్థితిని తొలిరోజునే ప్రజలు చూశారు. రాష్ట్రానికి ‘గూండారాజ్‌’ తెస్తున్నారు. @INCKarnataka మా కార్యకర్తలను ముట్టుకోకండి, జాగ్రత్తగా ఉండండి. అని ఆ ట్వీట్​లో బీజేపీ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement