Sunday, April 28, 2024

అన్నదాతను మోసం చేసిన వ్యాపారిపై పీడీ యాక్ట్..

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : వ్యవసాయదారులను మోసానికి గురిచేసే వారిపై పీడీ కేసులు నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. రైతులను అన్యాయం చేయాలని చూసిన, మోసం చేయాలని ప్రయత్నించిన సహించబోమని తేల్చిచెప్పారు. ఆరుగాలం శ్రమించే రైతాన్నలకు నష్టం చేకూర్చే ప్రయత్నాలు గానీ, కుట్రలు,కుతాంత్రాలు చేసే కుయుక్తులు పన్నవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా వీణవంక కు చెందిన రవిశెట్టి రవిబాబు, వరంగల్, కరీంనగర్ జిల్లాలోని రైతన్నల నుండి ధాన్యం కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వకుండ ఎగవేతకు పాల్పడిన నిందితుడిపై పిడి యాక్ట్ ను ప్రయోగించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రైతులను మోసం చేసే సాహసం మరెవ్వరూ చేయకుండా ఉండేందుకు గాను పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ తొలిసారిగా పిడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు.

పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ నిందితుడికి సోమవారం కాజీపేట ఏసీపీ కార్యాలయంలో అందజేశారు.అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ వివరాలను వెల్లడిస్తూ నిందితుడు వరంగల్ ,కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయ దారుల నుండి సుమారు 6 టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాడన్నారు. రైతులకు చెల్లించాల్సిన సుమారు కోటిన్నర రూపాయలకు పైగా ధాన్యం డబ్బులు చెల్లించకుండ డబ్బులు ఎగవేతకు పాల్పడ్డారు.

దీనిపై వ్యవసాయదారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎల్కతుర్తి, ముల్కనూరు, వంగర పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై కేసులు నమోదు చేశారు. దాంతో పోలీస్ కమిషనర్ రంగనాథ్ సమస్య తీవ్రతను గుర్తించి మోసానికి పాల్పడ్డ నిందితుడిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు.వ్యవసాయదారుల నుండి కొనుగోలు చేసిన ధాన్యంకు వ్యాపారస్తులు సకాలంలో చెల్లింపులు చేయాలని, అలాకాకుండా వారికి ఇచ్చే డబ్బులు ఎగవేత ధోరణికి పాల్పడితే సహించేది లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. దేశాభివృద్ధిలో కీలకంగా నిలిచే రైతన్నకు బాసటగా నిలువాల్సిన బాధ్యత మనందరి పై ఉందని పోలీస్ కమిషనర్ గుర్తు చేశారు. పిడి యాక్ట్ ఉత్తర్వులు అందజేసే కార్యక్రమంలో ఎల్కతుర్తి ఇన్స్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ ఐ మహేందర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement