Wednesday, May 8, 2024

Big story : ఏపీ రాజ‌ధాని విశాఖ .. ప‌క్కా అంటోన్న వైసీపీ నేత‌లు .. ప్ర‌క‌ట‌న ఎప్పుడంటే ..

ప్ర‌కృతి అందాల‌కి పెట్టింది పేరు విశాఖ‌ప‌ట్నం. ఓ ప‌క్క స‌ముద్ర‌తీరం , మ‌రోప‌క్క అంద‌మైన , ఎత్త‌యిన కొండ‌లు మ‌న‌సుని ఆహ్లాద‌ప‌రుస్తుంటాయి. ఏదో ప‌ర్యాట‌కుల‌లా ఇలా వెళ్లి ..అలా వ‌స్తేనే ఆ అందాల‌ను మ‌రువ‌లేం.. నిత్యం అక్క‌డే ఉండాల‌నే కోరిక ఉంటుంది. ఇవ‌న్నీ స‌రే ..అస‌లు మ్యాట‌రేంటంటే .. ఏపీకి మూడు రాజ‌ధానుల ప్రక‌ట‌న చేసి మ‌ళ్లీ వెన‌క్కి తీసుకుంది వైసీపీ ప్ర‌భుత్వం. అయితే రాజ‌ధాని ఏంట‌నేది మాత్రం స‌స్పెన్స్ గా మిగిలింది. ఇలాంటి త‌రుణంలో వైజాగ్ రాజ‌ధాని అవుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎందుక‌నుకుంటున్నారా రోజు రోజుకి విశాఖ‌ప‌ట్నంపై వైసీపీ ప్ర‌భుత్వానికి ఇష్టం విప‌రీతంగా పెరిగ‌డ‌మే కార‌ణం. అందుకే సరైన సమయం చూసి విశాఖనే రాజధానిగా చేసుకోవాలని వారు భావిస్తున్నట్లుగా స‌మాచారం. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసినా కూడా వైసీపీ ఆలోచనలు విశాఖ చుట్టూనే తిరుగుతున్నాయట‌.

కాగా సీఎం జగన్ ఈ మధ్యనే అసెంబ్లీ సాక్షిగా మూడు రాజ‌ధానుల‌ను రద్దు చేసుకున్నారు. ఈ మేర‌కు అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని అంతా భావించారు కూడా. అయితే ఇదే సందర్భంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలను వింటే ఖ‌చ్చితంగా ప్రభుత్వం మూడు రాజధానుల నుంచి వెనక్కి పోలేదని అర్ధమవుతుంది. అంతే కాదు బుగ్గన పదే పదే విశాఖ నగరం గురించి ప్రస్థావించ‌డం విశేషం. ఐదు, పదేళ్ళలో.. హైదరాబాద్ తో పాటు చెన్నై, బెంగళూరు ,ముంబై వంటి మెగా సిటీస్ తో పోటీ పడాలి అంటే విశాఖను మించిన నగరం వేరొకటి లేదు అని కూడా చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక విశాఖకు రైల్ రోడ్ ఎయిర్ సీ పోర్ట్ కనెక్టివిటీ ఉందని వెల్ల‌డించారు. పెట్టుబడులకు స్వర్గధామం కూడా అవుతుందన్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ మనసులో రాజ‌ధానిగా విశాఖ ఉన్న‌ట్టుగా టాక్ వినిపిస్తుంది.

ఇది ఇలా ఉండ‌గా లేటెస్ట్ గా జగన్ కి సన్నిహితుడు అయిన మరో మంత్రి బాలినేని శ్రీనివాసరావు మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెడతామని చెప్పారు. ఇక మూడు రాజధానులు అని కొత్త బిల్లులో ఎక్కడా ఉండబోదని స‌మాచారం. విశాఖ రాజధానిగా ప్రకటించడానికి ముహూర్తాన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారట‌. అన్నీ అనుకూలిస్తే ఉగాదికే కొత్త రాజధాని ప్రకటన ఉంటుందని కాస్తా అటూ ఇటూ అయితే శ్రీరామనవమి ప‌ర్వ‌దినాన ప్ర‌క‌ట‌న‌వెలువ‌డే ఛాన్స్ ఉంది. మరి ఈ రెండింటిలో ఏ ముహూర్తాన్ని ఎంచుకుంటారో తెలియదు కానీ డ్యామ్ ష్యూర్ గా విశాఖే ఏపీకి అసలైన సిసలైన రాజధాని అంటున్నారు. అస‌లే మాట త‌ప్పం మ‌డ‌మ‌తిప్పం అనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విశాఖ రాజ‌ధాని కోరిక నెర‌వేరుతుందా లేదా అనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement