Friday, December 2, 2022

BIG STORY : నల్లమలలో ప్రశ్నార్థకంగా పులుల మనుగడ..

కర్నూలు, ప్రభన్యూస్ : తెలుగు రాష్ట్రాల్లోని కర్నూలు, మహబూబ్‌నగర్, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తరించిన ఈ నల్లమల ప్రాంతం కృష్ణా, పెన్నా నదుల మధ్య ఉంది. సుమారు 9,500 కి.మీ విస్తీరణలో ఈ అటవీ ప్రాంతం ఉండగా.. అందులో దట్టమైన అటవీ ప్రాంతం పరిధి 3,560 కిలో మీటర్లు. అలాగే ఉత్తర-దక్షిణ దిశగా 150 కి.మీ వరకు విస్తరించిన నల్లమల అడవులు పులుల అభ్యయారణ్యంగా ప్రసిద్ధి. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్. అటువంటి అభయారణ్యంలో పులుల మనుగడకు ఇప్పుడు ప్రమాదం ఏర్పడుతుంది. అంతరించిపోతున్న పులుల సంతతి వన్యప్రాణి ప్రేమికులు ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం నల్లమల్ల అడవుల్లో 55 జాతల క్షీరదాలు, 200 రకాల పక్షులు, 18 రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు, వీటికి తోడుగా ఎన్నో రకాల కీటకాలు ఉన్నాయి. నల్లమల్ల అడవుల్లో ఎన్ని జంతు, చరాలు ఉన్న.. వాటిలో ప్రసిద్ధి చెందినది పెద్దపులి. కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులులు ఎక్కువగా శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని బ్లాక్ 2 గుండ్ల బ్రహ్మేశ్వరం, పచ్చర్ల, పెచేరువు, బైర్లూటి, నాగలూటి, రుద్రకోడూరు, వెలుగోడు రిజర్వాయర్ తదితర ప్రాంతాల్లో సంచరిస్తాయి.

పులులు సంచరించే ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి ప్రతియేటా ప్రత్యేక బృందాలతో అడవిలోని పులుల లెక్కింపు చేపడతారు. యానిమల్‌ ట్రాకర్‌, బేస్‌క్యాం పు వాచర్‌తో నలుగురు సభ్యులున్న బృందాలను ఏర్పాటు చేసి పులుల గణన నిర్వహిస్తారు. పులుల లెక్కింపులో ఎందుకంత శ్రద్ద అనే విషయాన్ని పరిశీలిస్తే.. పులికి మానవ జీవనంకు ముడిపడి ఉండటమే. అందుకే ప్రతి ఏటా అటవి శాఖ నేతృత్వంలో పులుల గణన చేపడుతున్నారు. ఇందుకోసమే కోట్ల రూపాయలను అడవి శాఖ ఖర్చు పెట్టడం గమనార్హం. వాస్తవంగా నల్లమలకు చెందిన టైగర్ అంటేనే ఓ ప్రత్యేకత. నడకలో రాజసం.. వేటలో గాంభీర్యం వెరసి అడవిలో రారాజుగా వెలుగొందుతోంది నల్లమల పెద్దపులి.

- Advertisement -
   

అడవిలో ఎన్ని పులులు ఉన్నా వాటి పరిధి వాటివే. దేని రాజసం దానితే. దేని రాజ్యం దానిదే. మగ పులి 150 నుంచి 200 చదరపు కిలో మీటర్ల పరిధిని తన ఏలికలో ఉండాలని గట్టిగా కోరుకుంటుంది. అదే ఆడపులి 70 నుంచి 80 కిలో మీటర్లను తన సామ్రాజ్యంగా భావిస్తుంది. ఓ మోస్తరు అడవి లేకుంటే అస్సలు సహించవు. రాజులు రాజ్యాలు ఏలినట్లుగా పులులు కూడా తమ తమ సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని తమ ఆదీనంలో ఉంచుకుంటాయి. ఇది పలానా పులి ఏరియా.. అంటూ తన శరీరం నుంచి ప్రత్యేక రసాయనాన్ని విడుదల చేస్తుంది. లేదంటే అక్కడి చెట్లపై గోళ్లలో గీకుతుంది. పులుల సంభోగ సమయంలో ఈ పక్రియ ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం నల్లమలలో 80 వరకు పెద్ద పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారుల అధికారులు అంచనా.

ఆహార అన్వేషణలో అంతరిస్తున్న పులులు..
ఇటీవల ఆహార అన్వేషణలో పులులు మరణిస్తూ ఉండడం వన్యప్రాణి ప్రేమికులను కలవరం కు గురి చేస్తుంది. ఆహారం కోసం వేటాడుతూ అరణ్యం దాటి బయటకొస్తున్న పులులు ప్రమాదాల బారినపడి మృత్యు వాతపడుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ తరచూ పులులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఒక వైపు పులుల సంతతి పెంచేందుకు చర్యలు తీసుకుంటుంటే.. మరో వైపు వేటాడే నేపథ్యంలో అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. గత రెండేళ్లలో మృతిచెందిన పులుల వివరాలు.. పరిశీలిస్తే ఇలా ఉన్నాయి 2020 జనవరి 20వ తేదీ కర్నూలు-గుంటూరు రహదారిపై నల్లమలలోని ఆర్‌.చెలమ బావి వద్ద కోతులను వేటాడే క్రమంలో ఓ చిరుతకూన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. 2020 ఏప్రిల్‌ నెలలో యర్రగొండపాలెం సమీపంలోని గాలికొండలో అటవీ ప్రాంతంలో వృద్ధాప్యంతో తీవ్రమైన ఎండవేడిమిని తట్టుకోలేక ఓ పెద్ద పులి మృతి చెందినట్లు అటవీశాఖ రికార్డులను బట్టి వెల్లడవుతుంది. అలాగే 2021 నవంబర్‌ 12న గిద్దలూరు-నంద్యాల మధ్య చలమ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌ దాటుతూ ప్రమాదవశాత్తూ రైలు కింద పడి ఓ పెద్ద పులి మృతి చెందింది.

తాజాగా కోతిని వేటాడే క్రమంలో మరో చిరుత బావిలో పడి మృతిచెందిన సంఘటన ఈనెల 6న వెలుగుచూసింది. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో వరుసగా పులులు మృతి చెందడం ఆందోళనకు కారణమైంది. వాటి సంరక్షణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ.. గడిచిన రెండేళ్లలో రెండు చిరుతలు, రెండు పెద్ద పులులు మృతి చెందాయి. ప్రధానంగా వేటాడే క్రమంలో ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నాయి. నల్లమల అభయారణ్యాన్ని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ (రాజీవ్‌ అభయారణ్యం)గా ప్రకటించింది. దోర్నాల-శ్రీశైలం, శ్రీశైలం-తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్‌ పరిధిలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు పులుల సంచారం ఉన్నందున అటవీశాఖ గేట్లను ఏర్పాటు చేసి రహదారులపై రాకపోకలను నిలిపివేస్తోంది. వేటగాళ్ల నుంచి పులులను కాపాడేందుకు నల్లమలలో 24 బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. మొత్తం 120 మంది టైగర్‌ ట్రాకర్లు పనిచేస్తున్నారు. ఒక్కో బేస్‌ క్యాంప్‌లో ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరు కాకుండా స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ సిబ్బంది అడవిలో తిరుగుతుంటారు. ఇంత జరుగుతున్నా తరచూ ఏదో ఒక చోట పులులు మరణిస్తునే ఉన్నాయి.

పులుల రక్షణకు ప్రత్యేక చర్యలు
నల్లమలలో పులుల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పులులతో పాటు ఇతర జంతువులకు తాగునీటి సమస్య లేకుండా చాలా ప్రాంతాల్లో సాసర్‌ పిట్లు ఏర్పాటుచేసి నీటి వసతి కల్పించారు. పులులు సంచరించే ప్రాంతాల్లో కెమేరాలు బిగించడం జరిగింది. బేస్‌క్యాంప్‌ సిబ్బంది 24 గంటల పాటు పులుల సంరక్షణపై దృష్టి పెడతారు. అడవుల్లోకి ఎవరొచ్చినా మాకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమించి జంతువులపై దాడులకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. నల్లమలలో మరో బేస్‌ క్యాంప్‌ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం అటవీశాఖ అధికారులు పంపారు. ముఖ్యంగా గిద్దలూరు-నంద్యాల మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రైళ్ల వేగం తగ్గించాలని ప్రతిపాదనలు పంపారు. దీంతో పాటు అండర్‌ పాస్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని ఉన్నాతాధికారులకు తెలిపారు. అటవీ ప్రాంతంలో నీటి కొరత లేకుండా చేస్తు ఉన్నారు. కృష్ణా రివర్‌ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉన్నందున గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్న ఫలితం లేకుండా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement