Wednesday, May 15, 2024

Big Story: స్టూడెంట్స్ కి తీరని కష్టం.. కరోనా దెబ్బకు మూలకుపడ్డ చదువులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: 2020 ఏప్రిల్ త‌ర్వాత‌ వరుసగా కొవిడ్ ఫ‌స్ల్ వేవ్‌, సెకండ్ వేవ్ జ‌నాల‌ను భ‌య‌పెట్టాయి. ఇంటి నుంచి బ‌య‌ట కాలుపెట్ట‌కుండా చేశాయి. దీంతో విద్యార్థుల‌ చ‌దువులు కూడా మూల‌కుప‌డ్డాయి. ప్రైవేట్ స్కూళ్లు ఆన్‌లైన్ పేరిట స్ట‌డీస్ చెప్పిన‌ప్ప‌టికీ అంద‌రికీ అవి అర్థంకాని ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్పుడు థ‌ర్డ్ వేవ్‌ ఒమిక్రాన్‌ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రధాని మోడీ గతేడాది ఏప్రిల్‌ నుంచి వరుసగా లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధించారు. రోజుల తరబడి ప్రజల్ని ఇళ్ళకే నియంత్రిం చారు. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో మరణాలు ఎక్కువ. అయితే అంతకుముందే ఆరోగ్య సమస్యలున్న వ్యక్తులపై కొవిడ్‌ తీవ్రంగా దాడి చేసింది. ఆరోగ్య సమస్యల్లేని వయోవృద్దులు కూడా కొవిడ్‌ నుంచి సురక్షితంగా బయట పడ్డారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ల నేపథ్యంలో ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌ విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఏపీలో అయితే ఒకేసారి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్‌ మీడియంలో పాఠాలు చెప్పడం అది కూడా ఆన్‌లైన్‌లో మొదలెట్టారు. 1వ తరగతి నుంచి విద్యావిధానంలో మార్పు లొచ్చేసాయి. పిల్లల చేతులకు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యాసంస్థల్ని మూసేశారు. పిల్లలు ఇళ్ళకే పరిమితమయ్యారు. రోజువారి విద్యా భ్యాసం కొరవడింది. విద్యావిషయాలపై విద్యార్థుల్లో ఆసక్తి సన్నగిల్లింది. ఎస్‌ఎస్‌సీ నుంచి ఆపై అన్ని పరీక్షల్ని నిలిపేశారు.

పరీక్షల్లేకుండానే ఉన్నత తరగతులకు ప్రమోట్‌ చేసేశారు. ఇవన్నీ విద్యార్థుల్ని కాపాడే లక్ష్యంతో ప్రభుత్వాలు అమలు చేశాయి. అదే సమయంలో విద్యార్థుల్లో ఒకతరం తమ జీవితకాలాన్ని తీవ్రంగా నష్టపోయింది. ప్రపంచంతో పోటీపడలేని దుస్థితికి దిగజారింది. మనకంటే ముందుగానే పలు దేశాలు విద్యాసంస్థల్ని తెరిచేశాయి. వేగంగా విద్యవ్యవస్థల్ని గాటన పెట్టేశాయి. భారత్‌లో మాత్రం ధైర్యం చేసి విద్యాసంస్థల్ని తెరవలేకపోయారు. ఆన్‌లైన్‌ విధానానికే ప్రభుత్వాలు మొగ్గుచూపాయి. ఈ దశలో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ పరీక్షలు నిర్వహించింది. వీటి ఫలితాలు వెలువడ్డాయి. ఒకప్పుడు ఇంటర్‌లో తెలంగాణ విద్యార్థులు 90శాతానికి పైగా ఉత్తీర్ణులయ్యేవారు. ఇప్పుడు ఉత్తీర్ణతా శాతం 49శాతానికి పడిపోయింది. ఉత్తీర్ణులైన వారిలో కూడా సగం మంది అత్తెసరు మార్కులతోనే పాసయ్యారు. ఫెయిల్‌ అయిన వారిలో 30శాతానికి పైగా విద్యార్థులు ఒక్కో సబ్జెక్ట్‌లో పదికి పైగా మార్కులు మాత్రమే తెచ్చుకోగలిగారు.

రెండేళ్లుగా విద్యావ్యవస్థల నిర్వీర్యానికి ఈ ఫలితాలు అద్దంపడుతున్నాయి. ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులంతా ఇప్పుడు భవిష్యత్‌ పట్ల తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఈ ఫలితాలు ఒక్క తెలంగాణ విద్యార్ధులకే కాదు.. దేశ వ్యాప్తంగా విద్యార్థులందరిపైన చూపుతున్నాయి. ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన తెలంగాణ విద్యార్థులు భవిష్యత్‌ పట్ల బెంగ పెట్టుకున్నారు. ఆత్మహత్యల దృక్కోణం స్పష్టమౌతోంది. పలుచోట్ల విద్యార్థులు జీవితంపై విరక్తి చెందినట్లు పేర్కొంటున్నారు. తామిక ఎందుకూ పనికిరామన్న ఆందోళనకు గురౌతున్నారు. ఉత్తీర్ణులు కాకపోయినా కనీస మార్కులు కూడా సాధించలేక పోవడం వీరిని మరింతగా కృంగదీస్తోంది. తామందరినీ ఉత్తీర్ణుల్ని చేస్తే తదుపరి తరగతుల్లో తమ విద్యాప్రమాణాల్ని పెంచుకుంటామంటూ ప్రభుత్వాధికారులు, మంత్రుల ఇళ్ళచుట్టూ కన్నీళ్ళ పర్యంతమౌతూ విద్యార్థులు తిరుగుతున్నారు.

తమ బంగారు భవిష్యత్‌ను కరోనా చిదిమేసిందంటూ రోధిస్తున్నారు. 1వ తరగతి నుంచి బీటెక్‌ వరకు ప్రతి విద్యార్థిప్రత్యక్షంగా, పరోక్షంగా సుదీర్ఘ లాక్‌డౌన్‌లు, విద్యాసంస్థల మూసివేత ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. వీరి పరిస్థితి సాధారణ ప్రజలకు కంట నీరు తెప్పిస్తోంది. వీరెవరికీ ఉన్నత విద్యావకాశాలు అందుబాటులోకి రావు. ఉద్యోగాలు లభించవు. విదేశాలకెళ్ళే అవకాశాలుండవు. చిన్నా చితకా పనులు చేసుకోవాలి. లేదా కూలిపనులకు వెళ్ళాలి. అదీకాకుండా వ్యవసాయ కూలీగా మారాలి. ఇవేవీ చేయలేని విద్యార్థులకు ఆత్మహత్యలే శరణ్యమంటూ వారు పడుతున్న ఆవేదన పాలకుల వైఫల్యాల్ని ఎండగడుతోంది.

ఈ దుస్థితికి ప్రధాన కారణం ప్రధాని నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారుల వరకు తమ పరిజ్ఞానానికి అనుగుణంగానే కొవిడ్‌ సమయంలో నిర్ణయాలు తీసుకున్నారు. కొవిడ్‌ కారణంగా పిల్లలుకు పెద్దగా నష్టం చేకూరలేదు. పిల్లలపై కొవిడ్‌ పెద్దగా ప్రభావం చూపలేదు. కొంతమందికి సోకినా దానివల్ల ప్రాణనష్టం జరగలేదు. వీటన్నింటిని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోలేదు. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. రెండో తరంగ సమయంలో ప్రపంచంలో మరెక్కడా లేని స్థాయిలో భారత్‌లో మాత్రమే ఆక్సిజన్‌ కొరత కారణంగా లక్షలాదిమంది మరణించారు. రెండో తరంగం పంజా విసరబోతోందంటూ ముందుగానే నిపుణులు, శాస్త్రజ్ఞులు అంచనాలేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వాలకు తెలియజేశారు. అయినా అంచనాల్ని కట్టడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ ఫలితాన్ని భారత్‌ మొత్తం చవిచూసింది.

- Advertisement -

కొవిడ్‌ సమయంలో వెల్లువెత్తే ఆరోగ్య సమస్యల్ని మాత్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. విద్యార్థుల్ని ఇళ్ళకే పరిమితం చేయాలి. ఇందుకోసం విద్యాసంస్థల్ని మూసేయాలి. నెలల తరబడి విద్యార్థుల్ని విద్యాభ్యాసానికి దూరం చేస్తే భవిష్యత్‌లో వారు ఎదుర్కోబోయే పరిమాణాల్ని ప్రభుత్వం ఏమాత్రం అంచనా వేయలేదు. తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులే కాదు.. దేశవ్యాప్తంగా ప్రతి స్థాయిలోని విద్యార్థుల ప్రమాణాలు ఇప్పుడిదే స్థాయిలో ఉన్నాయి. మాతృభాషకు విద్యార్థుల్ని దూరం చేయడం.. రాష్ట్ర విద్యాప్రణాళికల్ని పక్కనపెట్టి సీబీఎస్‌ఈ వైపు మొగ్గుచూపడం, ఆన్‌లైన్‌ విద్యావిధానానికి తెరదీయడం వంటి అంశాలన్నీ ఓ తరం విద్యార్థుల భవిష్యత్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement