Sunday, May 5, 2024

బండి సంజయ్‌కి గంగులపై పోటీ చేసి గెలిచే దమ్ముందా.. మంత్రి కేటీఆర్ సవాల్

ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ మూడేళ్లయినా కరీంనగర్‌ జిల్లాకు చేసింది గుండు సున్నా అని, కరీంనగర్‌కు వైద్య కళాశాల, ట్రిపుల్‌ ఐటీని కూడా తీసుకురాలేకపోయారని మంత్రి కేటీఆర్ అన్నారు. యువతలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న సంజయ్‌.. మత పిచ్చి రేపడం తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా?. మందిర్‌, మసీదు అంటున్న సంజయ్‌ కనీసం ఒక్క గుడినైనా నిర్మించారా? అని ప్రశ్నించారు.

కరీంనగర్‌/చొప్పదండి/హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆరు నుంచి తొమ్మిది మాసాల్లో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. నిరుద్యోగ యువత ప్రభుత్వం ప్రకటించిన ఈ ఉద్యోగాల కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కోరారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని ఆయన చెప్పారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మంత్రి రామారావు గురువారం విస్తృతంగా పర్యటించారు. కరీంనగర్‌ పట్టణంతో పాటు చొప్పదండి ఇతర ప్రాంతాల్లో ఆయన వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నడుం బిగించిందని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని ఆయన కోరారు.

బండికి సవాల్‌ విసిరిన కేటీఆర్‌
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలవాలని మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్‌ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆయన కరీంనగర్‌ నగర ప్రజలను కోరారు. రోజూ సీఎం కేసీఆర్‌ను దుర్భాషలాడడం, ఆయనపై విరుచుకుపడ్డడం తప్ప సంజయ్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చేసింది గుండు సున్నా అని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 15వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన కమలాకర్‌కు ఈ దఫా లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని మంత్రి కరీంనగర్‌ పట్టణానికి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అడ్డి మార్‌ గుడ్డి దెబ్బ అన్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన బండి సంజయ్‌ తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఎంపీగా గెలిచారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికి పరిమితమైన బండి సంజయ్‌ కరీంనగర్‌ జిల్లా ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఉదయం లేచింది మొదలు యువతీ యువకుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే తప్ప ఆయన ఏం చేశారని నిలదీశారు. మందిర్‌, మసీదు అంటూ మాట్లాడడం తద్వారా రెండు, మూడు ఓట్లు పొందడం బాజపాకు పరిపాటిగా మారిందని కనీసం కరీంనగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కూడా అనుమతి తీసుకురాలేకపోయారని సంజయ్‌పై విరుచుకుపడ్డారు. బీసీ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పది ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణానికి అనుమతి తీసుకువచ్చి ఈ పనులను ప్రారంభించారని గుర్తు చేశారు.

మత పిచ్చి తప్ప సంక్షేమ పనులు ఒక్కటైనా చేశారు?
తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే బాజపా మాత్రం రాష్ట్రంలో మత పిచ్చిని రేపుతోందని కేటీఆర్‌ మండిపడ్డారు. మూడేళ్లుగా ఎంపీగా ఉంటున్న బండి సంజయ్‌ ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని ప్రశ్నించారు. ఎప్పటికీ విషం చిమ్మడమే రాజకీయం కాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కేంద్రాన్ని సంజయ్‌ ఎప్పుడైనా అడిగారా అని నిలదీశారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ కోరితే కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి ఇక్కడి ప్రభుత్వం రూపాయి ఖర్చు పెడితే కేంద్రం నాలుగు రూపాయలు ఇవ్వాలని ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా భారత ప్రభుత్వం విదల్చడం లేదని మండిపడ్డారు.

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనసులను దోచుకోవాలె తప్ప మత పిచ్చి రేపి సమాజంలో గొడవలు సృష్టించి తద్వారా లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు తగిన శాస్త్రి చెబుతారని హెచ్చరించారు. కరీంనగర్‌కు ట్రిపుల్‌ ఐటీ కావాలని ఎన్నో రోజులుగా అడుగుతున్నా కేంద్రం చోద్యం చూస్తోందని కరీంనగర్‌ లోక్‌సభకు గతంలో ఎంపీగా పని చేసిన వినోద్‌ కుమార్‌ ఎన్నోమార్లు ప్రధాని మోడీని, అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిని కలిసి ట్రిపుల్‌ ఐటీ కావాలని కోరినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు మెడికల్‌ కళాశాలను కూడా తీసుకురాలేని నిస్సహాయ స్థితిలో బండి సంజయ్‌ ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని నేదునూరులో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం భూ సమీకరణ కూడా చేసిందని కానీ ఇంత వరకు ఈ కేంద్రం అతీగతీ లేకుండాపోయిందని చెప్పారు.

- Advertisement -

వెయ్యి పనులు చేశాం… నువ్వేం చేశావో చెప్పు
తెరాస ఎన్ని పనులు చేసిందంటే.. వెయ్యి పనులు చేశానని ఆ వివరాలన్నీ చెబుతానని కానీ బాజపా ఏం పని చేసిందో, రాష్ట్రానికి తీసుకువచ్చిందేంటో బండి సంజయ్‌ చెప్పగలరా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎంపీగా గెలిచి మూడేళ్లయినా మూడు కోట్ల రూపాయల పనులు కూడా చేయలేదని అన్నారు. అరపైస పని చేయని సంజయ్‌ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పడ్డాక పింఛన్లను పది రెట్లు పెంచామని చెప్పారు. 4 లక్షల 65వేల మంది బీడీ కార్మికులకు రూ.2,016 పింఛన్‌ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని చెప్పారు. వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదని మరే ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా కార్యక్రమం అమలు చేయడం లేదని ఆయన గుర్తు చేశారు. భర్తల చేత నిరాదరణకు గురై ఒంటరి మహిళలు లక్ష మందికిపైగా పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌ సర్కార్‌ అని అన్నారు.

గత ప్రభుత్వాలు దివ్యాంగులకు రూ.500 పెన్షన్‌ ఇస్తే తమ ప్రభుత్వం రూ.3016 పెన్షన్‌ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని.. తమది మనసున్న ప్రభుత్వమని అన్నారు. తమ ప్రభుత్వం రూ.2వేలు పెన్షన్‌ ఇస్తే కేంద్రం మరో రూ.4వేలు కలిపి రూ.6వేల పెన్షన్‌ ఇచ్చి పేద ప్రజల మనసులు గెలుచుకోవాలని సూచించారు. దళిత బంధు ద్వారా తమ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తోందని కేంద్రం మరో రూ.10 లక్షలు కలిపి రూ.20 లక్షల సాయం చేసి దళితుల మనసులను గెలుచుకోవాలని సూచించారు. పనికి మాలిన మాటలు.. కోతలతో కడుపు నిండదని చెప్పారు. ప్రగతిపథంలో తెలంగాణ దూసుకుపోతోందని భారతదేశానికి అన్నం పెట్టే మొదటి నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే అందులో తెలంగాణ బిడ్డుల రక్తలం, చెమట ఉందని చెప్పారు. తెలంగాణ దేశానికి బువ్వ పెడుతోందని కేంద్రం నుంచి వస్తున్నదేమీ లేదని పేర్కొన్నారు. పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తుంటే అందులో 50 పైసలు మాత్రమే రాష్ట్రానికి వస్తుందని మిగతా 50 పైసలు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలకు వెళ్తున్నాయని పేర్కొన్నారు.

కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం
పేదవారికి ఇచ్చే రేషన్‌ బియ్యంలో నియంత్రణ ఉండేదని గతంలో మనిషికి ఐదు కిలోల చొప్పున కుటుంబానికి 20 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చే వారని కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అన్నారు. పది లక్షల మంది ఆడపిల్లలకు కల్యాణలక్ష్మీ కార్యక్రమాన్ని అమలు చేసి పెళ్లిళ్లు జరిపించామని పేర్కొన్నారు. ఏ కులం వారైనా.. మతం వారైనా.. సరే తెల్ల రేషన్‌ కార్డు ఉంటే చాలు.. వారికి కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వానికి కుల పిచ్చి, మత పిచ్చి లేదని గుర్తు చేశారు. కరీంనగర్‌లో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని అన్నారు.
వచ్చే నెల నుంచి పింఛన్లు

రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన అర్హులైన వారందరికీ ఏప్రిల్‌ లేదా మే మాసం నుంచి పింఛన్లు చెల్లిస్తామని కేటీఆర్‌ చెప్పారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామని చేసేది చెప్పే ప్రభుత్వం కేసీఆర్‌ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటి ప్రభుత్వం రూ.200 పింఛన్‌ ఇచ్చేదని వృద్ధులకు ఈ మొత్తం మందు గోలీలు కొనుగోలుకు సరిపోయేది కాదని సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టాక పెన్షన్‌ మొత్తాన్ని పది రెట్లు పెంచి రూ.2వేలు చేశారని దీంతో వృద్ధులు, మహిళల ఆత్మగౌరవం పెరిగిందని చెప్పారు. 82 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరిని మేడిగడ్డ నుంచి ఎత్తి కాళేశ్వరం ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పీ, లోయర్‌ మానేరు డ్యామ్‌, మిడ్‌ మానేరు, అప్పర్‌ మానేరు డ్యామ్‌ పూర్వ కరీంనగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌దని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు. ఈ ప్రాజెక్టు నుంచి హుజురాబాద్‌, హుస్నాబాద్‌, చొప్పదండి, మానకొండూరు, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్‌ జిల్లాలకు తాగునీరు, సాగునీరు వస్తున్నాయని ఇంత భారీ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని బండి సంజయ్‌ ఒక్కసారైనా పార్లమెంట్‌లో ప్రస్తావించారా అని నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement