Monday, April 29, 2024

Big Story: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ప్రశ్నార్థకం.. కొందరి తీరుతో పోలీసుశాఖకు అప్రదిష్ట

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పోలీసు అంటే మళ్ళీ భయం పెరుగుతోందా.. ఖాకీ పేరంటేనే జనం దూరంగా జరుగుతున్నారా.. కొన్నేళ్ళుగా రాష్ట్రంలో అమలవుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌ క్రమేణా మసకబారుతోందా.. ప్రభుత్వం, పోలీసుశాఖ ఆశయానికే గండి పడుతోందా.. కొందరు పోలీసుల అధికారుల వల్ల ప్రజల్లో ప్రతిష్ట దిగజారి నానాటికీ వ్యతిరేకత పెరుగుతోందా.. మొత్తం పోలీసు వ్యవస్థే తల దించుకోవాల్సి వస్తోందా.. పాతకాలపు పైశాచి కత్వం, ఖాకీ కరుకుతనం, లాఠీ కాఠిన్యం మరలా పోలీసుశాఖ లో కన్పిస్తోందా.. అంటే నిజమనే అంటున్నారు జనం. మొన్నటికి మొన్న తూర్పుగోదావరి జిల్లా మండపేట ఘట న ఇంకా మరిచిపోకుండానే కృష్ణాజిల్లాలో తాజాగా చోటు చేసుకున్న మరో ఘటన పోలీసు వ్యవస్థలోని పరిస్థితిని చాటుతోంది. విచారణ పేరుతో అదుపులోకి తీసుకున్న వ్యక్తిపై ఎస్‌ఐ చేసిన దాష్టీకం నిందితుడిని ఆత్మహత్యకు పురిగొల్పింది.
దీంతో ఆ ఎస్‌ఐని సస్పెండ్‌ చేస్తూ కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశిల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరోచోట కూడా లాఠీ కాఠిన్యానికి ఒక నిండు ప్రాణం బలైంది. కృష్ణాజిల్లా రేపూడితండాకు చెందిన లాకావత్‌ బాలాజీ అనే వ్యక్తిని నాటుసారా కేసులో విచారణ పేరుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సదరు బాలాజీ ఆత్మహత్యకు ప్రయత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనుమానితునిగా అదుపులోకి తీసుకున్న ఎ.కొండూరు ఎస్‌ఐ శ్రీనివాస్‌ పెట్టిన చిత్ర హింసలకు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారుల విచారణలో ప్రాధమిక ఆధారాలు లభించడంతో ఎస్‌ఐని సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మైలవరం సీఐ ఎల్‌ రమేష్‌పై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఘటనకు సంబంధించి నూజివీడు డిఎస్పీనీ వివరణ కోరుతూ జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశిల్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కావడం దురదృష్టకరమని పోలీసు వర్గాలే ఒప్పుకుంటున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలో..

కస్టడీలో ఉన్న యువకుడుని మండపేట సిఐ పెట్టిన చిత్రహింసలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన పోలీసుశాఖను సమాజం ముందు దోషిగా నిలుబెడుతోంది. మండపేటకు చెందిన ప్రగడ అర్జున్‌ అనే యువకుడిని ఓ కేసులో కస్టడీకి తీసుకున్న అక్కడి సిఐ ఒకరోజంతా స్టేషన్‌లోనే నిర్భంధించి చావబాదారు. అతనిపై ధర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. మలద్వారం గుండా లాఠీని చొప్పించి అత్యంత పాశవికంగా హింసించారు. సిఐ పెట్టిన హింస, అవమానం భరించలేని యువకుడు పంట పొలాల్లోని షెడ్డుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు మృతదేహాంతో సెంటర్‌లో ఆందోళన చేయడం తప్ప కోల్పోయిన కొడుకును తిరిగి పొందలేని పరిస్ధితి. ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ జరిపించిన ఎస్పీ ఎం రవీంద్రనాధ్‌ బాబు నివేదిక ఆధారంగా ఏలూరు రేంజ్‌ డిఐజి కెవి మోహనరావు ఎట్టకేలకు సిఐ దుర్గాప్రసాద్‌ను సస్పెండ్‌ చేశారు. సదరు సీఐపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి.

నెల్లూరు జిల్లాలో..

ఇదే తరహాలో నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న మరో పోలీసు కాఠిన్యం కలకలం రేపుతోంది. ఓ మహిళ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. మొత్తం పోలీసు వ్యవస్థపైనే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రెకెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా కలిగి రి మండలం పెద్ద అన్నలూరు గ్రామకంఠం భూముల్లో వేసిన అక్రమ లే అవుట్లను నిలదీసినందుకు ఓ మహిళను చీరలూడదీసి అవమానించడం మొత్తం మహిళా లోకానికే తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సాక్షాత్తు మహిళా దినోత్సవం రోజునే ఇది జరిగింది. ఓవైపు పోలీసు వ్యవస్థð రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు చేసుకుంటుండగా అదేరోజు కొందరు పోలీసులు మహిళల పట్ల వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది. తరం మారుతున్నా తీరు మారని ఖకీల నిర్వాకం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు శాఖ, ఉన్నతాధికారులు నిత్యం ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేయాలని చెబుతున్నా కొందరు పోలీసు అధికారులకు చెవికెక్కడం లేదని జనం మండిపడుతున్నారు.

- Advertisement -

పశ్చిమగోదావరి జిల్లాలో..

అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డి గూడెం మండలం తిరుమలాపురం గ్రామంలో స్తానిక ఎమ్మెల్యేని ఓ సభలో ప్రశ్నించినందుకు పోలోజు అంజి అనే యువకునిపై పోలీసులు జరిపిన దాడి గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అంటే అమాయకులు, మహిళల పట్ల పోలీసులే గూండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

సస్పెన్షన్‌ తోనే సరా..

కాగా.. అటు మండపేట, ఇటు కృష్ణాజిల్లా , మరికొన్ని ఘటనల్లో బాధ్యులైన పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేయడం, చర్యలు తీసుకున్నంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి రాదని, కేవలం చర్యలు తీసుకోవడం కాదు.. అసలు పోలీసులకు కౌన్సిలింగ్‌ నిర్వహించాలని న్యాయనిపుణలు అభిప్రాయపడుతున్నారు. సహజంగా నేరస్తులకు కౌన్సిలింగ్‌ ఇచ్చే పోలీసులు నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతుంటారని, అయితే పోలీసుశాఖలో కొందరు అధికారులు నేరగాళ్ళ మాదిరిగానే ప్రవర్తిస్తున్నందున వారిలో పరివర్తన కోసం పోలీసులకే ప్రభుత్వం అప్పుడప్పుడు కౌన్సిలింగ్‌ కార్యక్రమాలు అమలు చేయాలని సూచిస్తున్నారు. ప్రజల పట్ల, నిందితుల పట్ల నడుచుకోవాల్సిన తీరును దేశ అత్యన్నత స్తానం సుప్రీం కోర్టు పలుమార్లు చెబుతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని అంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసిం గ్‌ అంటూ ఓ వైపు ఊదరగొడుతూనే మరోవైపు అమాయకులను, మహిళలను కొందరు పోలీసులు చావకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుశాఖలోని కొందరు పైశాచిక ఖాకీలను సంస్కరించాల్సిన అవసరం ఉందని ఇకనైనా డీజీపీ దృష్టి సారించి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సామాన్య జనం కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement