Friday, April 26, 2024

మ‌రో 4 నెల‌లు ఉచిత రేష‌న్.. ఆమోదించిన కేంద్రం…

ప్రభ‌న్యూస్ : ఉచిత రేషన్‌ పథకాన్ని మరో 4 నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షత సమా వేశమైన కేంద్ర మంత్రివర్గం, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని 2022 మార్చి వరకు పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన ప్రజలు ఆకలితో అలమటించకూ డదన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గతేడాది ప్రవేశపెట్టిన ఈ పథకం ఇప్పటి వరకు 4 దశలుగా కొనసాగుతూ వచ్చింది. ఐదవ దశను ఈ ఏడాది డిసెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి నెల వరకూ అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, అంత్యోదయ అన్న యోజన ప్రాధాన్యతా కుటుంబాల పథకం పరిధిలోని లబ్ధిదారులందరికీ ఈ పథకం కింద నెలకు ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఆహారధాన్యాలను కేంద్రం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం పరిధిలోకి వచ్చే పేదలకు కూడా ఈ ప్రయోజనం చేకూరుతుంది.

అన్న యోజన పథకం మొదటి దశ 2020 ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెల వరకు అమలవగా, ఆ తర్వాత దీన్ని పొడిగిస్తూ కేబినెట్‌ నిర్ణయించింది. 2వ దశ పథకం 2020 జూన్‌ నుంచి నవంబరు వరకు, 3వ దశ 2021 మే నెల నుంచి జూన్‌ వరకూ అమలైంది. 4వ దశ జూన్‌ నుంచి ప్రస్తతం అంటే నవంబరు వరకూ అమలులో ఉంది. ఇక కేంద్రమంత్రివర్గం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు 5వ దశ అమలు కానుంది. ఈ దశకు కేంద్ర ప్రభుత్వంపై అదనంగా రూ. 53,344.52 కోట్ల మేర సబ్లిడీ భారం పడుతోందని కేంద్రం వెల్లడించింది. మొదటి దశ నుంచి ఇప్పటి వరకు కేంద్రంపై పడ్డ ఆర్థిక భారం రూ. 2.60 లక్షల కోట్లు అని కేంద్రం పేర్కొంది. అలాగే 5వ దశలో మొత్తం ఒక కోటి 63 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని దాదాపు 80 కోట్ల మంది లబ్ధిదారుల కు ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల చొప్పున అదనపు ఆహార ధాన్యాలను (బియ్యం లేదా గోధుమలను) ఉచితంగా పంపిణీ చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement