Friday, May 3, 2024

టెస్ట్ పాసైతేనే ఎల్ కె జిలో అడ్మిష‌న్ …. కార్పొరేట్ స్కూల్స్ న‌యా దందా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కోవిడ్‌ నేపథ్యంలో గత రెండు విద్యా సంవత్సరాలు స్తబ్దుగా ఉన్న కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగియక ముందే విద్యావ్యాపారానికి తెరతీస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అసలు పరీక్షలు ముగియక ముందే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేశాయి. కొన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలైతే నయా దోపిడీకి తెరలేపాయి. ఏకంగా అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షల (అడ్మిషన్‌ టెస్టు)ను నిర్వహిస్తున్నాయి. హైస్కూల్‌ విద్యార్థులకంటే ఏమో అనుకోవచ్చు…కానీ ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్‌, సెకండ్‌ ఇలా ప్రాథమిక తరగతి విద్యార్థులకు కూడా అడ్మిషన్‌ టెస్టులు నిర్వహించి అడ్మిషన్లు ఇస్తున్నారు. అది కూడా ఆ టెస్టులో పాస్‌ అయితేనే సీటు దొరుకుతోంది. లేకుంటే అంతే సంగతులు. ఈ రకంగా అక్రమ అడ్మిషన్లకు తెరలేపి భారీ మొత్తంలో ఫీజులు దండుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మొద్దు నిద్ర వహిస్తుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎల్‌కేజీ, యూకేజీలో సీటు కావాలన్న కొన్ని స్కూళ్లు అడ్మిషన్‌ టెస్టులను నిర్వహిస్తున్నాయి. కిండర్‌ గార్డెన్‌ నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్‌ పొందాలంటే ఇందుకు దరఖాస్తు ఫీజు రూ.500 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక అడ్మిషన్‌ ఫీజైతే దాదాపు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇలా ఒక్కోలా వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

ఈ అడ్మిషన్‌ టెస్టులు నెలలో ప్రతీ ఆదివారం లేదా వచ్చే అడ్మిషన్ల సంఖ్యను బట్టి రెండు మూడ్రోజులకోసారి ఆయా స్కూళ్లను బట్టి నిర్విహిస్తున్నారు. హైదరాబాద్‌ రామ్‌నగర్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యం అడ్మిషన్‌ టెస్టులను గత మార్చి నెల నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ రకంగా అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తూ ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా దండుకుంటున్న కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లు హైదరాబాద్‌ నగరంలో భారీగానే ఉన్నట్లు పలు విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.

టెస్టులపై నిషేధమున్నా!…
విద్యాహక్కు చట్టం ప్రకారం ఏ పాఠశాలలో కూడా అడ్మిషన్ల కోసం టెస్టులు నిర్వహించకూడదు. ఇలా టెస్టులు నిర్వహించే పాఠశాలల గుర్తింపు రద్దు చేయడంతోపాటు భారీగా జరిమానా విధించే అధికారం విద్యాశాఖ అధికారులకు ఉంటుంది. అయితే ఈ నిబంధనలు పట్టించుకునే వారే కరువయ్యారు. వార్షిక పరీక్షలకు రెండు నెలల ముందు నుంచే అడ్మిషన్‌ల ప్రక్రియకు హడావుడీ మొదలవుతోంది. టెస్టుల తేదీలను ప్రకటించడం, వాటిని నిర్వహించడం, ఫలితాలు వెలువరించడం, ఆతర్వాత అడ్మిషన్లు తీసుకోవడం లాంటి ప్రక్రియను చేపడుతుంటారు. ఇక కొన్ని స్కూళ్లయితే సెంట్రల్‌, అంతర్జాతీయ సిలబస్‌తోపాటు, జేఈఈ, నీట్‌, ఐఐఐటీ సిలబస్‌ బోధన ఉంటుందని హంగు ఆర్భాటాలు చేసి, ప్రకటనలు గుప్పిస్తుంటారు. ముందస్తుగానే సీట్లు రిజర్వు చేసుకోవాలని ఈ విధంగా టెస్టులను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదువుకోవాలనే కోరికతో కార్పొరేట్‌ పాఠశాలల ఉచ్చులో పడిపోతున్నారు. వారికి తెలియకుండానే అడ్మిషన్‌, డొనేషన్‌, ట్యూషన్‌ ఫీజులను కట్టేస్తున్నారు.

ఇప్పటికే చలా స్కూళ్లలో అడ్మిషన్లు ముగిసినట్లు తెలుస్తోంది. మరోవైపు గుర్తింపు లేని పాఠశాలలు కూడా యథేచ్ఛగా నడుస్తున్నా అధికారులు వాటిని పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. దీంతో తల్లిదండ్రులకు తెలియకా వాటిలోనే చేర్పిస్తున్నారు. గుర్తింపు పొందిన పాఠశాలల వివరాలను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలనే డిమాండ్‌ ఉన్నా దాన్ని అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.
టెస్టులు నిర్వహించే స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలి: టి.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన్‌ టెస్టులను నిర్వహించ కూడదు. కానీ చాలా వరకు కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లు దరఖాస్తు ఫీజు, అడ్మిషన్‌ ఫీజులను తీసుకుంటూ టెస్టులను నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు కూడా టెస్టులు నిర్వహించడం దారుణం. అడ్మిషన్‌ టెస్టులు నిర్వహించే స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement