Friday, May 3, 2024

Goa Elections: ఆప్ గోవా సీఎం అభ్యర్థిగా పాలేకర్

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మి పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్.. తాజాగా గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త అమిత్ పాలేకర్ ను గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ప్రకటించారు. పాలేకర్ గోవా జనాభాలో దాదాపు 35 శాతం ఉన్న OBC భండారీ సామాజిక వర్గానికి చెందిన వారు. పాత గోవా వారసత్వ ప్రదేశంలో అక్రమ నిర్మాణాన్ని నిరసిస్తూ ఇటీవల నిరాహార దీక్ష చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. గతేడాది అక్టోబర్‌లో ఆప్‌లో పాలేకర్ చేరారు.

పనాజీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేజ్రీవాల్‌ గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పాలేకర్ పేరును ప్రకటించారు. పాలేకర్ పేరును ప్రకటించే ముందు, కోస్తా రాష్ట్రంలో పార్టీ తన ప్రచారానికి ఒక “నిజాయితీ గల వ్యక్తి”ని ఎంపిక చేసిందని కేజ్రీవాల్ అన్నారు. సంఘంలో సంక్షేమ కార్యక్రమాలతో మంచి పేరున్న వ్యక్తిని ఎంపిక చేశామని చెప్పారు. గోవా జనాభాలో భండారీ సామాజిక వర్గం 35 శాతం ఉండగా.. రాష్ట్రప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రం చూసిన కుల రాజకీయాలను సరిదిద్దేందుకు మాత్రమే తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

కాగా, 40 సీట్ల ఉన్న గోవా అసెంబ్లీకి 2017 ఎన్నికల్లో ఆప్ పోటి చేసింది. 39 మంది అభ్యర్థులను నిలబెట్టి, ప్రతిష్టాత్మకంగా ప్రచారం నిర్వహించినప్పటికీ 2017 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement