Saturday, April 20, 2024

నియత… ప్రాణయుక్త… దేవి అంటే..

సీతాన్వేషణకు కపులను నలుదిక్కులకు పంపగా, దక్షిణ దిక్కుకు పోయిన హనుమంతుడి బృందం తప్ప, మిగి లిన వారంతా తిరిగివచ్చిన తరువాత, ఇంకా సీతాదేవి వార్త తెలియరానందున, రామచంద్రమూర్తి సంతాప పడుతుం టాడు కిష్కింధ సమీపంలో. సంతాప పడుతున్న శ్రీరామచంద్రుడిని చూసిన సుగ్రీవుడు, ఆయనతో, ఓదార్పు మాటలతోనూ, ధైర్యవచ నాలతోనూ మాట్లాడాడు. వానరులు నిస్సందేహంగా సీతను చూసొచ్చారనీ, గడువు దాటి కార్యం సాధించకుండా, తన ఎదుట కు వచ్చే ధైర్యం వాళ్లకు లేదనీ, కార్యసాధకులు కాకపోతే, తాతతం డ్రులు రక్షించుకుంటూ వస్తున్న ఉద్యానవనంలోకి ప్రవేశించడానికి ఎన్ని గుండెలుండాలనీ, సీతాదేవి వార్త తెలిసి వుండాలనీ, ఈ కార్యం సాధించగలవాడు హనుమంతుడొక్కడేననీ, ఇతరులకిది దుస్సా ధ్యం అనీ, అంటాడు సుగ్రీవుడు.
ఇలా రామసుగ్రీవులు మాట్లాడుకుంటున్నప్పుడు, సింహనాదాలు చేసుకుంటూ అంగదుడినీ, ఆంజనేయుడినీ, మనస్సులో తలచుకుంటూ, వానరులు సుగ్రీవుడి దగ్గరగా దిగారు. శ్రీరామ చంద్రమూర్తికి నమస్కరించి, హనుమంతుడు సీతాదేవి గురించి సర్వస్వం తెలియ చెప్పేవిధంగా, మూడేమూడు మాటలంటాడు. ”నియత… ప్రాణయుక్త… దేవి” అని. ఎంతో యుక్తితో హనుమ పలికిన ఆ మూడు మాటలు వింటూనే, సుగ్రీవుడు రామకార్యం ఫలించిందనీ, తన మాట చెల్లించుకున్నాననీ సంతోషించాడు. శ్రీరామలక్ష్మణులు ప్రీతిగా, ప్రియమైన మాటలు చెప్పిన హనుమంతుడిని ప్రేమగా అలాగే చాలాసేపు చూస్తుండిపోయారు.
”నియత” అంటే పాతివ్రత్య నియమం కలదనీ, ”ప్రాణయుక్త” అంటే జీవించి వున్నదనీ, ”దేవి” అంటే సీతాదేవి అనీ ఆ మూడు మాటలకు అర్థం. సీతాదేవి ప్రాణాలతో బ్రతికున్నా, శీలం చెడిన దయితే చచ్చినదానితో సమానమైంది కనుక, ”శీలం” కలదని ”నియత” అని మొదట అంటాడు. శీలం కలిగిన విషయం నిజమే! చనిపోతే శీలం వున్నా లాభం ఏమిటి? కాబట్టి జీవించే వున్నదని ”ప్రాణయుక్త” అంటాడు. ”దేవి” శబ్దం తనకు సీతాదేవి మీదున్న భక్తి, గౌరవం చెప్పటానికే! దేవుడి భార్య దేవి. దేవీ శబ్దం లక్ష్మి పర్యా యపదంగా అష్టోత్తర శతనామావళిలో చెప్పబడింది. రామ, దేవ శబ్దాలు సమానార్థం కలిగున్నవే! తనకామె సాక్షాత్తూ ”లక్ష్మీదేవి” లాగా కనపడిందన్న భావన.
వానరులందరూ, రామలక్ష్మణ సుగ్రీవుల దగ్గరకు పోయి, నమస్కరించి, సీతాదేవి రావణాసురుడి ఇంట్లో వున్న సంగతి, రాక్షస స్త్రీలు ఆమెను బెదిరిస్తున్న విషయం, రావణుడు పెట్టిన గడువు వ్యవహారం, సీతాదేవి పతిభక్తి గురించి వివరంగా చెప్పారు. సీతాదేవి క్షేమసమాచారం విన్న శ్రీరాముడు, ఆమె ఎక్కడుంది, ఏం చేస్తున్నది, తన విషయంలో ఏ నియమంతో వుంది, వివరించమని వానరులను అడిగాడు. చూసి వచ్చిన హనుమంతుడినే, ఈ విష యాలన్నీ చెప్పమని మిగిలిన వానరులంటారు. హనుమంతుడు అప్పుడు సీతాదేవి వుండే దిక్కుకు తిరిగి, మనసులోనే సీతాదేవికి వినయంగా నమస్కరించి, శ్రీరామచంద్రమూర్తితో చెప్పడం మొద లెట్టాడు. ”సీతాదేవిని చూడాలనే కోరికతో నూరు యోజనాల సము ద్రాన్ని దాటి వెళ్ళాను. అక్కడ దేవతల విరోధి రావణాసురుడుండే లంకనే పట్టణముంది. ఆ రాక్షస రాజు ఇంట్లో, ఏ కోరికల్లేక, నిన్ను చూద్దామన్న ఒకే ఒక్క కోరికతో, ఊపిరి బిగబట్టుకునివున్న సీతను చూశాను. దు:ఖమంటే ఏమిటో తెలియక, సుఖపడాల్సిన సీత, చెప్పనలవికాని శోకంతో అశోకవనంలో వుంది. రావణుడి అంత: పురంలోని చెరలో చిక్కుకున్న సీతాదేవికి కాపలాగా రాక్షస స్త్రీల గుంపులున్నాయి. సర్వకాల సర్వావస్థలందు సీత నిన్ను ధ్యానించ డంలోనే నిమగ్నమయింది. దేహం కాంతి చెడి, ప్రాణాలు విడుద్దా మని ఆలోచిస్తున్న సీతాదేవిని అదే సమయంలో అతికష్టం మీద చూశాను. నా రాకను ఆమెకు తెలియచేసే వుద్దేశంతో, ఆమెను నమ్మిం చేందుకు ఇక్ష్వాకు రాజుకీర్తిని ఆమె వినేటట్లు స్మరించాను.”
”మహామహిమ గల సీతాదేవి మిగుల నిర్మల స్వభావంతో నిన్ను మనస్సులోనే స్మరిస్తున్నది. సత్పురుషులను ప్రశంసించే భక్తి, స్వభావం, పాతివ్రత్యం, తపస్సు, ఉపవాసం వదలకుండా, అశోక వనంలో వుంది. ఇది వీరెవ్వరూ నాతో చెప్పిందికాదు. స్వయంగా నా కళ్లతో నేనే చూసాను” అంటూ, తనూ, సీతాదేవీ మాట్లాడామన టానికి గుర్తుగా చిత్రకూట పర్వతంపైన జరిగిన కాకాసుర వృత్తాం తాన్ని చెప్పాడు. చెప్పి,”అక్కడ చూసిన సర్వస్వం చెప్పమన్నది సీతాదేవి. చెప్పాను. నెలరోజులెట్లాగో ప్రాణాలు నిలబెట్టుకుంటా నన్నది. ఎంత శుష్కించి పోయినా, పతివ్రతా ధర్మాన్ని మాత్రం విడవకుండా, రావణుడింట్లో నిర్బంధంగా జీవిస్తున్నది. ఉన్న దున్నట్లు సర్వం నీకు తెలిపాను. నీవె్లటనా సముద్రాన్ని దాటే ప్రయ త్నం చేయి” అంటాడు. చెప్పదల్చుకున్నది చెప్పిన తర్వాత, అక్క డున్న వారందరూ నమ్మేటట్లు, సీతాదేవి ఇచ్చిన చూడామణి దివ్య రత్నాన్ని తీసి శ్రీరాముడికి సమర్పించాడు హనుమంతుడు.
సీతను తలచుకుని, ఆమెను కౌగలించుకున్న రీతిలో, చూడా మణిని రొమ్మునకు హత్తుకుని, సీతను తలచుకుంటూ, దు:ఖం పొంగిపొర్లి వస్తుంటే, లక్ష్మణ, సుగ్రీవులతో ఇలా అంటాడు శ్రీరాముడు- ”సుగ్రీవా! ఈ చూడామణిని చూడగానే, నా మనస్సు ఎక్కడికో పోయింది. దీన్ని మా మామగారు, సీతాదేవికి వివాహ సమయంలో ఆమె శిరస్సున అలంకరించాడు. దివ్యమై, సత్పురుష పూజితమై, జలంలో పుట్టిన ఈ చూడామణిని, యజ్ఞం చేస్తున్న మా మామగారికి, ఆయన మీద దయతో, సంతోషంతో ఇంద్రుడు ఇచ్చా డు ఆయనకు. దీనిని చూస్తుంటే, మామామ జనకరాజునూ, తండ్రి నీ చూసినట్లు అయింది. సీతాదేవి శిరస్సులో ప్రకాశించే దీనిని చూడ గానే సీతాదేవే వచ్చినట్లుగా అనిపిస్తున్నది. నన్ను విడిచి సీత ఇంకొక నెల రోజులు జీవించి వుంటే, ఆమెకు మరణమేలేదు. ఎన్ని రోజు లైనా బ్రతికుంటుంది. నేను బ్రతికుండాలంటే నన్నామె దగ్గరకు తీసుకొనిపొండి. సీత ఇలా వుందని విని కూడా, ప్రాణాలతో వుండ డం నా వశం కాదు.”
శ్రీరాముడి కోరిక ప్రకారం హనుమంతుడు సీతాదేవి చెప్పిన మాటలన్నీ వినిపించాడు. గుర్తుగా చిత్రకూట పర్వతం మీద జరిగిన కాకాసుర వృత్తాంతాన్నీ చెప్పాడు. సీతాదేవిని చూసి, ఓదార్పు మాటలతో నేను, సీతకు కష్టకాలం పోయిందనీ, దు:ఖం అంతరి స్తుందనీ, లంకనెప్పుడు భస్మం చేయాలా అని రామలక్ష్మణు లిద్దరూ ఎదురు చూస్తున్నారనీ, చెప్పానంటాడు హనుమంతుడు. సీతకు ద్రోహం చేసిన, రావణుడిని బంధువులతో సహా చంపి శీఘ్రంగా అయోధ్యకు రామచంద్రుడు తీసుకుపోయే సమయం వచ్చిందని కూడా సీతాదేవికి చెపానని శ్రీరాముడికి చెబుతాడు.
ఆమెకు ఓదార్పు మాటలతో చెప్పిన విషయాలను రాముడికి విన్నవించిన తర్వాత జరిగిన సంభాషణను కూడ చెప్పాడు. ”అ మ్మా! రాజపుత్రీ! రామచంద్రమూర్తి జ్ఞాపకం వుంచుకునే గుర్తు ఏదైనా ఇవ్వు, అంతమాత్రం చేస్తే చాలు అని తను చెప్పగానే, దగ్గర లో వున్న రాక్షస స్త్రీలెవరూ చూడకుండా, నలుదిక్కులా కలియ చూసి, రావణుడికి తెలియకుండా వుండాలనే వుద్దేశ్యంతో, తలలో ధరించాల్సిన చూడామణిని, చీరె కొంగుముడిలోనుండి తీసి, తనపై వున్న ప్రేమతో, తన చేతుల్లో వుంచిందంటాడు. అది తీసుకుని ఆమె తో బయల్దేరుతానని చెప్పానన్నాడు. తనపైన శ్రీరాముడికి కల స్నేహ భావం వల్లా, రాముడి దూతనైనందువల్లా, తృప్తిలేని అనురాగంతో, నమ్మకంతో, తనతో సీతాదేవి సంభాషించిందనీ, ఆ వివరాలూ ఆమె మాటల్లో చెప్పాడు.

”నువ్వెట్లాగూ సముద్రాన్ని దాటిపోతావు. రాముడికి నా సంగ తులన్నీ చెప్తావు. ఆ అన్నదమ్ములిద్దరూ, వానరసేనతో సముద్ర తీరా నికి వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే ప్రశ్న. ఎలుగుబంట్లు, వానరులు, రాజకుమారులు, అలవికాని ఆ సముద్రాన్ని ఎట్లా దాటు తారయ్యా? ఈ భూప్రపంచంలో, నువ్వూ, గరుత్మంతుడు, వాయు దేవుడు తప్ప ఇంక ఎవరూ ఈ సముద్రాన్ని దాటలేరని నా అభి ప్రాయం. నేనాలోచిస్తున్న కొద్దీ, వారిక్కడకు రావడం, అసాధ్యమైన పనిలాగానే తోస్తున్నది. అయినా కార్యదక్షుడవైన నీకు చేయలేని పనేదీలేదు. దీనికి ఏమని సమాధానమిస్తావు? ఎలా నెగ్గుకొస్తావో నాకు తెలియదు కాని, సాధించగలవాడివి మాత్రం నీవొక్కడివే! ఎవరూ చేయలేరు, కీర్తినీ పొందలేరు. కాని నీవిలాచేయడం నాకు కీర్తి కరం కాదు. రామచంద్రమూర్తి సైన్యంతో వచ్చి, యుద్ధంలో బల పరాక్రమాలను ప్రదర్శించి, రావణుడిని చంపి, నన్ను అయోధ్యకు తీసుకొని పోతేనే అది నాకు కీర్తికరం. అప్పుడే నేను వీరపత్నినన్న బిరుదుకు కూడా అర్హురాలిని అవుతాను. ఇది రాముడికి సాధ్యపడు తుందా? పడదా? అనే సంగతి వేరే విషయం. కాని ఇంకేవిధంగా జరిగినా నాకు కీర్తికరం కాదు. నేను చెప్పినట్లు చేసి, తన బలంతో, బాణాలతో లంకను భస్మం చేసి, నన్ను వెంట తీసుకునిపోతే, నాకే కాదు, శ్రీరాముడికీ కీర్తి. ఆయన వంశానికీ కీర్తి దక్కుతుంది. నాకోసం కాకపోయినా, తనకోసమైనా నేను చెప్పినట్లు చేయాల్సిందేనని నా కోరిక. ఆడదానినైన నా ఆలోచనావిధానమిది. యుద్ధంలో శూరు డైన రామచంద్రమూర్తికి తగినటువంటి చర్య ఏదో ఆలోచించి చెప్పు” అంటూ సీతాదేవి పలుకులను రాముడుకు చెప్పాడు హనుమ. వానర, భల్లూకరాజైన సుగ్రీవుడు సీత నిమిత్తమై, గొప్ప సైన్యంతో రాముడికి సహాయపడేందుకు నిర్ణయించుకున్నాడనీ, ఆయనతో వచ్చేవారంతా అసమాన పరాక్రమవంతులనీ, దేవత లతో సమానులనీ, మనోవేగం కలవారనీ, దిక్కులలో, ఆకాశంలో సంచరించేవారనీ, వారంతా శీఘ్రంగా రాబోతున్నారనీ, సీతకు ధైర్యం చెప్పానన్నాడు హనుమంతుడు.
”రామలక్ష్మణులు ఎట్లా వస్తారా అనే సందేహం కానీ, రారని శోకించడం కానీ వదులుకో. నీవు దు:ఖించే కాలంపోయింది. నేను పోయి చెప్పగానే ఒక్కగంతేసి, వానరులొస్తారిక్కడకు. రామలక్ష్మ ణులు, సూర్య, చంద్రుల్లాగా నావీపుపైకెక్కి, నీ ఎదుట నిలుస్తారు. వారి బాణాగ్నికి లంకంతా పాడైపోతుంది. రావణుడిని సేనలతో సహా చంపి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకుపోతాడు. మేమెప్పు డొస్తామా అని మా రాకకొరకు ఎదురుచూస్తుండు. ఏ సాహసం చేయొద్దీలోపల. మండుతున్న అగ్నిహూత్రం లాగా రామచంద్ర మూర్తిని ఇక్కడ చూస్తావు. రాక్షసుడికేగతి పడ్తుందో చూడు. కొడు కులతో, చుట్టాలతో, మంత్రులతో చచ్చిపోయి రావణుడు నేల కూల గా చూసిన నీవు దు:ఖ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటావు. నీ భర్తను కలుస్తావు” అని చెప్పానన్నాడు.
కోరలు, గోళ్ళు ఆయుధాలుగాగల పరాక్రమవంతులైన వాన రులు త్వరలోనే లంకకు రావడం, సీతాదేవే స్వయంగా చూడబోతు న్నదనీ, వారి భయంకర సింహనాదాలు లంకలోని పర్వతాలలో వినపడే సమయం ఆసన్నమయిందనీ, తాను సీతాదేవికి చెప్పాన న్నాడు హనుమంతుడు. నిబంధన ప్రకారం వనవాసాన్ని గడిపి, విరోధులందరినీ చంపి, సీతాదేవితో సహా అయోధ్యలో పట్టాభిషేకం జరుపుకుంటారనీ కూడా చెప్పానన్నాడు. ఇలా ఎన్నోవిధాలుగా చెప్పి, ఆమెను నమ్మించి, దు:ఖపడకుండా చేసి వచ్చానంటాడు.
హనుమంతుడు రామచంద్రమూర్తికి సీతా వృత్తాంతమే చెప్పా డు కాని, తను పడ్డ కష్టాలను ఒక్కటైనా చెప్పలేదు. చెప్పితే ఆత్మ స్తుత వుతుందనుకుంటాడు. ఇంకో విషయం, శ్రీరాముడికి చెప్పాల్సింది సీతా వృత్తాంతం కాని, హనుమంతుడు పడ్డ ప్రయాసకాదు కదా!
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

  • వనం జ్వాలా నరసింహారావు
    8008137012
Advertisement

తాజా వార్తలు

Advertisement