Sunday, May 5, 2024

మిస్సింగ్​ కేసులో 17ఏళ్ల బాలిక మృతి.. ప్రేమ వ్యవహారమే అంటున్న పోలీసులు

తమిళనాడులో కనిపించకుండా పోయిన ఓ 17ఏళ్ల బాలిక చనిపోయింది. అయితే ఇది ప్రేమ వ్యవహారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ బాలికను తీసుకెళ్లిన యువకుడు, ఆమెతో కలిసి విషం తీసుకున్నారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. కాగా ఈ కేసులో పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. మధురైలోని తుంబాయిపట్టిలో ఈ ఘటన జరిగింది.

మదురైలో మైనర్ బాలిక (17) మృతికి సంబంధించి తమిళనాడు పోలీసులు ఎనిమిది మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు నాగూర్ హనీఫాతో కలిసి ఆ బాలిక పారిపోయింది. అయితే ఆమెను వారికి ఇంటికి తిరిగి పంపించాలని నిందితుడి తల్లి చెప్పడంతో తాము ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. వారు అన్నంత పని చేశారు.. విషపు గుళికలు తీసుకోగా నిందితుడు హనీఫా వాటిని మింగకుండా ఉమ్మివేసి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, విషపు గుళికలు మింగిన ఆ బాలిక పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.

తమిళనాడులోని మదురైలోని తుంబాయిపట్టికి చెందిన 17 ఏళ్ల బాధితురాలి తల్లిదండ్రులు ఫిబ్రవరి 14న తమ కుమార్తె కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు మొదట ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవద్దని పోలీసులను అభ్యర్థించారు. ఇది పిల్లల భవిష్యత్ ను దెబ్బతీస్తుందనే భయంతో  వారు అలా కోరారు. కాగా, దీనిపై పోలీసులు విచారణ చేపట్టాలంటే  FIR నమోదు చేయాలని పోలీసులు పట్టుబట్టడంతో ఒప్పుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అదే ప్రాంతానికి చెందిన నాగూర్ హనీఫా అనే వ్యక్తితో ఆ బాలిక సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. మార్చి 3న నాగూర్ హనీఫా తల్లి మదీనా అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని తీసుకొచ్చి తల్లిదండ్రుల ఇంటి వద్ద వదిలి వెళ్లినట్లు సమాచారం.

అనంతరం ఆ బాలికను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉండడంతో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఈ బృందాలు మధురై, తిరుపూర్, చెన్నైలలో విచారణ జరిపాయి.

నాగూర్ హనీఫాను ప్రత్యేక బృందం మార్చి 5వ తేదీన అరెస్టు చేసింది. అతడిని విచారించగా ఫిబ్రవరి 14న అతడు బాలికతో పారిపోయాడని పోలీసులు గుర్తించారు. తన స్నేహితుల సహాయంతో బాలికతో కలిసి ఈరోడ్‌లోని తన మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడే వారు కలిసి ఉన్నారు. కాగా, ఈ విషయం తెలిసిన నాగూర్ హనీఫా తల్లి ఆ బాలికను వారి ఇంటికి పంపించాలని సూచించింది.. లేకుంటే చాలా ప్రాబ్లమ్స్​ ఫేస్​ చేయాల్సి వస్తుందని చెప్పింది. దీనికి ఒప్పుకోని వారిద్దరు ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు నాగూర్ హనీఫా తెలిపాడు. ఈ కేసులో నాగూర్ హనీఫాతో పాటు అతని తల్లి, సహకరించిన మరో ఏడుగురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement