Monday, May 13, 2024

రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసిన షర్మిల

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  కార్యకర్తలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేశారు. గత ఆరేళ్ల కాలంలో ఉద్యోగ నియామకాల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలిచి , భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే దీక్ష చేపట్టినట్టు తెలిపారు.

నిరుద్యోగుల బాధలకు చలించి, వారికి భరోసా కల్పించాలని ఉద్యోగ సాధన దీక్ష చేపట్టినట్లు ఆమె తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్నందు వల్ల కార్యకర్తల, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యత కలిగిన నాయకురాలిగా కొలువుల సాధన దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆమె తెలిపారు కొలువులు సాధించే వరకు ఈ పోరాటం కచ్చితంగా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించే ఉద్దేశంతో ఉన్న షర్మిల.. ఇటీవల ఉద్యోగ సాధన దీక్షను చేపట్టారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ 72 గంటల దీక్ష చేశారు. తొలుత హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద ఒక రోజు దీక్ష చేసిన షర్మిల ఆ తర్వాత తన నివాసం లోటస్ పాండులో దీక్షలను కొనసాగించారు. 


Advertisement

తాజా వార్తలు

Advertisement