Thursday, May 16, 2024

ఈ గ్రామాల్లో అందరి ఇళ్లకు అమ్మాయిల పేర్లే.. ఎందుకో తెలుసా?

ముందుగా మహిళా దినోత్సవం సందర్భంగా మగువలందరికీ శుభాకాంక్షలు. మహిళా సాధికారత గురించి మనం వింటుంటాం. కానీ అవన్నీ ఒట్టి కబుర్లుగానే మిగిలిపోతున్నాయి. ఆచరణలో పెట్టే నేతలు కనిపించడం అరుదు. మహిళా దినోత్సవం అంటూ మహిళలకు ఓ రోజును కేటాయించడం తప్ప చేసిందేమీ కనిపించడంలేదు. అయితే ఆడపిల్లల కోసం మిషాసింగ్ అనే మహిళా నేత ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఆమె మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా పంచాయతీ విభాగం సీఈవోగా పనిచేస్తున్నారు. ఆమె ఆలోచన ప్రకారం ప్రధాన్ ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరైన లబ్దిదారులకు సదరు ఇంటికి ఆడపిల్లల పేర్లతో అందిస్తున్నారు. 2015లో ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన ‘భేటీ పడావో భేటీ బచావో’ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో PMAY కింద ముంజూరైన సదరు ఇంటికి ఆడపిల్లల పేర్లు పెట్టి ఇస్తున్నారు.

అయితే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మిషాసింగ్ ఎంతో కష్టపడ్డారు. ముందు షాజాపూర్ జిల్లాలలోని అన్ని గ్రామాలను సర్పంచ్‌లను కలిసి తన ఆలోచనను వివరించి సహాయం చేయాలని కోరారు. దీంతో ఆమె ఆలోచనకు అనూహ్య స్పందన వచ్చింది. గ్రామాలలోని ప్రజలు తమ ఆడపిల్లల పేర్లను తమకు రాబోయే ఇళ్లకు పెట్టుకోవడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయా గ్రామాలలో ‘మోనికా నివాస్’, ‘రేఖా భవన్’, ‘వందనా నివాస్’, ‘కవితా భవన్’ అంటూ ఆడపిల్లల పేర్లే కనిపిస్తాయి. మహిళా సాధికారత, బాలికా విద్య, లింగ సమానత్వం, అమ్మాయిల ప్రాధాన్యత, ఆర్ధిక సాధికారత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని.. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని మిషాసింగ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement