Saturday, April 27, 2024

IPL: కోహ్లీ కొత్త చ‌రిత్ర… ఐపిఎల్ లో అరుదైన ఘ‌న‌త‌…

రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన తన ఆటలో ఏ మాత్రం జోరు తగ్గలేదని రాయల్ ఛాలెంజర్స్ బెంగూళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నిరూపించాడు. పంజాబ్ కింగ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 77 పరుగులు చేశాడు. 11 బౌండరీలు, రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు.

కోహ్లి ఎదుర్కొన్న తొలి 15 బంతుల్లో ఏకంగా 33 పరుగులు బాదాడు. ఆ తర్వాత మరో ఎండ్‌లో వికెట్లు పడటంతో కోహ్లి సంయమనంతో ఆడాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఈ క్రమంలో కోహ్లి పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో ఛేదనలో అత్యధిక 50+ స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా కోహ్లి చరిత్రకెక్కాడు. అలాగే టీ20ల్లో 100 సార్లు 50+ రన్స్ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

అంతేగాక ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత క్రికెటర్ల జాబితాలో సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి విరాట్ కోహ్లి రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లి, ధోనీ 17 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 19 సార్లు ఈ అవార్డు తీసుకున్నాడు.

- Advertisement -

ఫీల్డింగ్‌లోనూ కోహ్లి రికార్డులు బ్రేక్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడం ద్వారా కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో సురేశ్ రైనా పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ క్యాచ్‌ను కూడా అందుకున్న కోహ్లీ.. టీ20 క్రికెట్‌లో ఇప్పటి వరకు 174 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత సురేశ్ రైనా(172), రోహిత్ శర్మ(167), మనీష్ పాండే(146), సూర్యకుమార్ యాదవ్(136) క్యాచ్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement