Sunday, May 19, 2024

ఇంగ్లండ్‌తో 5వ టెస్టు కెప్టెన్‌గా బుమ్రా.. వైస్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌

ముంబై: ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టు మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్‌ బుమ్రాన్‌ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్‌లో వెల్లడించింది. రోహిత్‌ శర్మకు కరోనావైరస్‌ సోకడంతో ప్రస్తుతం ఐసొలేషన్‌ ఉన్నాడు. గురువారం ఉదయం నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలడంతోనే బుమ్రాకు జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీసీఐ పేర్కొంది. బర్మింగ్‌హామ్‌లో బుమ్రా మీడియా సమావేశంలోనే ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆరునెలల కాలంలోనే ఇటు దేశీయంగా, అటు విదేశీ పర్యటనలో సిరీస్‌లకు వివిధ కారణాలతో ఐదుగురు కెప్టెన్లు మారారు. విరాట్‌ కోహ్లీ వైదొలగిన తర్వాత రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, రిషబ్‌ పంత్‌ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే.

భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ తర్వాత ఓ ఫాస్ట్‌ బౌలర్‌ ఇండియా జట్టుకు నేతృత్వం వహించడం బుమ్రానే మొదటి వ్యక్తి. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా 2-1తో ముందుంది. బుమ్రా నేతృత్వంలో నేడు జరుగనున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ జట్టు రాణించి, సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లో సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లోనూ రోహిత్‌, బుమ్రా అద్భుతంగా రాణించారు. బుమ్రా 18 వికెట్లు పడగొట్టగా, అందులో నాటింగ్‌హామ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 5/64 బెస్ట్‌గా నిలిచాడు. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో 4/46, లార్డ్స్‌ 3/33, ఒవల్‌లో 2/67, 2/27గా రాణించాడు. గత ఏడాది సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు బుమ్రా వైస్‌ కెప్టెన్‌గా, అంతకు ముందు మార్చిలో దేశీయంగా శ్రీలంకతో జరిగిన సిరీస్‌కూ వైఎస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ పర్యటన నేపథ్యంలో టెస్ట్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక కాగా, తాజాగా పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనర్లుగా దిగే అవకాశాలున్నాయి. మరోవైపు టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, మరో జోడీని కూడా రెడీ చేశారు. కెఎస్‌ భరత్‌, ఛతేశ్వర్‌ పుజారా జోడీ ఎలా ఉంటుందనే అంశంపై జట్టు సభ్యులతో సమీక్షించారు. శుక్రవారం నుంచి జరుగనున్న ఐదో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే… 2007 తర్వాత రెండో టెస్టు సిరీస్‌ సాధించినట్లవుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement