Sunday, May 5, 2024

Badminton | ప్రణయ్‌ ఓటమి.. జపాన్‌ మాస్టర్స్‌లో భారత్‌ పోరాటం ముగిసింది

జపాన్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 బ్యాడ్మంటన్‌ టోర్నీలో బారత్‌ పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌ మ్యాచ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ రెండో రౌండ్‌లో ఓడి ఇంటిబాట పట్టాడు. గురువారం జరిగిన 2వ రౌండ్‌లో 7వ సీడ్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21-19, 16-21, 19-21 తేడాతో ప్రపంచ 12వ ర్యాంకర్‌ చైనీస్‌ తైపీ షట్లర్‌ చౌ తీన్‌ చెన్‌ చేతిల ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఇటీవల గాయం నుంచి కోలుకొని షట్టిల్‌ కోర్టులో అడుగుపెట్టిన ప్రణయ్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అద్భుతంగా పోరాడి విజయం సాధించాడు. కానీ రెండో రౌండ్‌లో తడబడిన ఇతను రెండో రౌండ్‌ మ్యాచ్‌ను దాటలేక పోయాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలో జోరును ప్రదర్శించిన భారత స్టార్‌ తొలి గేమ్‌లో దూకుడైన ఆటతో ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగాడు.

కానీ తైపీ షట్లర్‌ కూడా తానేమి తక్కువ కాదంటూ ప్రణయ్‌పై వరుస స్మాష్‌లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఈ సెట్‌ హోరాహోరీగా జరిగింది. ఆఖర్లో దూకుడు పెంచిన ప్రణయ్‌ 21-19 తేడాతో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. తర్వాతి రౌండ్‌లో పుంజుకున్న చెన్‌ ప్రణయ్‌పై ఎదురుదాడికి దిగి వరుసగా పాయింట్లు సాధించడంతో ప్రణయ్‌ ఈ గేమ్‌ను కోల్పోయాడు. ఇక నిర్ణయాత్మక చివరి గేమ్‌లో ఇద్దరూ మరోసారి హోరాహోరీగా తలపడ్డారు.

- Advertisement -

కానీ చివరి నిమిషంలో తెలివిగా ఆడిన తైపీ షట్లర్‌ ప్రణయ్‌పై రెండు పాయింట్ల ఆధిక్యంతో ఈ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నాడు. దీంతో ప్రణయ్‌ పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. అంతకుముందు పురుషుల సింగిల్స్‌ విభాగం నుంచి లక్ష్యసేన్‌, ప్రియాన్షు రజావత్‌లు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. పురుషుల డబుల్స్‌ భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టిలు తొలి రౌండ్‌ను దాటలేక పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement