Sunday, May 19, 2024

AP | ట్రిపుల్‌ ఐటీ హాస్టల్‌లో కొండ చిలువ.. భయాందోళనలో విద్యార్థులు

వేంపల్లె, ప్రభ న్యూస్ : వైఎస్‌ఆర్‌ జిల్లా, వేంపల్లి మండలంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలోని హాస్టల్‌లోకి కొండచిలువ ప్రవేశించింది. దీంతో హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. గురువారం ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలోని న్యూ క్యాపస్‌లో ఉన్న బాయ్స్‌ హాస్టల్‌ – 2లోకి పెద్ద కొండచిలువ వెళ్లి మంచం క్రింద చుట్టుకుంది. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు గదిలోకి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే అలజడి రావడంతో మంచం కింద ఉన్న కొండచిలువను చూసి కేకలు వేశారు.

ఈ సమాచారం అందిన వెంటనే అధికారులు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ బాలసుబ్రమణ్యంకు తెలియజేయడంతో హుటాహుటిన ఫారెస్ట్‌ సిబ్బంది హాస్టల్‌ గదిలో ఉన్న కొండచిలువను చాకచక్యంగా గోను సంచిలో బంధించి సమీపంలోని అడవుల్లో దానిని డిప్యూటీ రెంజ్‌ అధికారి గురప్పా, మధు, ఎస్‌ బిఓ శివ మోహన్‌ రెడ్డిలు విడిచి పెట్టారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రిపుల్‌ ఐటీ అటవీ ప్రాంతంలో ఉండడంతో విష పురుగులతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

గతంలో కూడ పాత ట్రిపుల్‌ ఐటీ క్యాపస్‌ భవనాల్లో పాములు వస్తుడడంతో విద్యార్థులు ఆందోళన చేసిన సంఘటనలు ఉన్నాయి. హాస్టల్‌ గదులకు కిటికిలు సరిగా లేక పోవడంతోనే కొండచిలువ వచ్చినట్లు విద్యార్థులు అంటున్నారు. ట్రిపుల్‌ ఐటీ అధికారులు కూడా విష పురుగులు రాకుండా ఉండేందుకు ట్రిపుల్‌ ఐటీ ఆవరణంలో ఉన్న గడ్డిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement