Sunday, May 5, 2024

మీ భద్రతే.. మా లక్ష్యం..

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ : సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పలు పొలీసు స్టేషన్లు అద్దె భవనాలు, పురాతన భవనాల్లో విధుల నిర్వహణ సాగేది. అయితే రెండేళ్ల క్రితం పోలీసు స్టేషన్లకు శాశ్వత భవనాల నిర్మాణానికి పునాదులు పడ్డాయి. అవి గతేడాది కాలంగా వేగంగా రూపుదిద్దుకునేలా సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రత్యేక చొరవ చూపారు. ఫలితంగా ఇప్పటికే అనేక నూతన పోలీసు స్టేషన్లు అత్యాధునిక హంగులతో బాధితులకు సేవలు అందించేందుకు అందుబాటులోకి వచ్చాయి. పోలీసు స్టేషన్లకు శాశ్వత భవనాలకు సీపీ ప్రత్యేక చొరవ దేశంలోనే ఎంతో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో రోజురోజుకు జనాభా పెరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే వేగంగా, నిమిషాల వ్యవధిలోనే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసు సేవలు అందించేందుకు కొత్త పొలీసు స్టేషన్లను ఇప్పటికే కేటాయించారు. అయితే కొత్త పొలీసు స్టేషన్లకు శాశ్వత భవనాలు లేవు. సిబ్బంది ప్రశాంతంగా విధులు నిర్వహించేందుకు సరైన భవనాలు కూడా లేకపోవడంతో ఇన్నాళ్లూ అద్దె భవనాలు, ప్రభుత్వ భవనాల్లో విధులను కేటాయించారు. అయితే వీటన్నంటిని దృష్టిలో పెట్టు కుని ప్రభుత్వం శాశ్వత భవనాలను అత్యాధునిక హంగులతో నిర్మించింది. వేగంగా నూతన భనవాలు నిర్మాణమయ్యేలా సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రత్యేక చొరవ చూపి, అందుకనుగుణంగా నిత్యం రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ అంజనీకుమార్‌ ఆదేశాలతో అత్యాధునిక హంగులతో నూతన పోలీసు స్టేషన్‌ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసువచ్చారు. ఇందులో భాగంగా గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఇరు-కై-న భవనాల్లో పోలీసు సేవలనందించిన పోలీసులు, ఇక నుంచి అత్యాధునిక హుంగులతో నిర్మించిన పోలీసు స్టేషన్‌ల నుంచి ప్రజలకు సేవలు అందించనున్నారు.

అందుబాటులోకి కొత్త పోలీసు స్టేషన్‌ భవనాలు
మొన్నటివరకు కొన్ని పోలీసు స్టేషన్లకు శాశ్వత భవనాలు లేవు. దీంతో కొన్ని ఏళ్లపాటు- పురాతన భవనాలు, పెచ్చులూడుతున్న భవనాలు, కిరాయి భవనాల్లో విధులు నిర్వహించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మొన్నటివరకు పురాతన భవనాల్లో సాగిన బాచుపల్లి, నార్సింగి, చేవేళ్ల, నందిగామ పోలీసు స్టేషన్లు ఇప్పుడు నూతన భవనాల్లోకి వచ్చేశాయి. ఇక నుంచి పూర్తిస్థాయి హంగులతో నిర్మించిన భవనాల్లో నుంచే విధులు నిర్వహించనున్నారు పోలీసులు. మొన్న బాచుపల్లి, నార్సింగి పోలీసు స్టేషన్లను ప్రారంభించిన హోంమంత్రి, డీజీపీ, బుధవారం చేవెళ్ల, నందిగామ పోలీసు స్టేషన్లను ప్రారంభించారు. దీందో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సిబ్బందిలో నూతన ఉత్సహాన్ని నింపగలిగారు.

మేము ఉన్నది ప్రజల కోసమే : స్టీఫెన్‌ రవీంద్ర, సీపీ సైబరాబాద్‌
సైబరాబాద్‌ పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనేదానికి అనేక ఘటనలు సాక్ష్యం. ఇరవై నాలుగు గంటలు బాధితుల పక్షాన నిలబడేందుకు మా సిబ్బంది కృషి చేస్తున్నారు. సిబ్బందికి మౌళిక సదుపాయాలను కల్పించేందుకు నిత్యం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. సిబ్బందికి అన్ని సదుపాయాలు ఉన్నప్పుడే ప్రజలకు అత్యంత వేగంగా సేవలు అందించగలుగుతామనే విశ్వాసం దిశగా చర్యలు తీసుకుంటున్నాం. అతి త్వరలో మరిన్ని శాశ్వత భవనాల్లో పోలీసు స్టేషన్లను అందుబాటులోకి తీసుకవచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మీతోనే..మీ వెంటే సిద్దాంతానికి కట్టుబడి పనిచేస్తామని హామి ఇస్తున్నాం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement