Thursday, May 16, 2024

యాదాద్రి మహాద్భుతం…..

ఆధ్యాత్మిక పరిమళాలతో అబ్బురపరుస్తున్న కట్టడం
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌
త్వరలో వైభవోపేతంగా ప్రారంభోత్సవ సంరంభం
మేలోనే.. ముహూర్తం

హైదరాబాద్‌, : వెయ్యేళ్ళు నిలిచేలా.. తరతరాలు తలిచేలా యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రం ముస్తాబైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎంతో పట్టుదలతో , భక్తితో నిర్మించిన ఆలయం.. తెలంగాణ రాష్ట్రంలో మకుటాయమానం కానుంది. ఓ వైపు ఆధ్యాత్మిక పరిమళం.. ఆహ్లాదం పంచే ఆకుపచ్చని వాతావరణం.. మరోవైపు ప్రపంచంలోనే అద్భుత దృశ్యకావ్యంగా జరిగిన నిర్మాణం.. యాదాద్రిని దర్శించిన వారు వావ్‌.. అంటూ అచ్చెరువొందేలా యాదగిరీశుడు, శ్రీలక్ష్మీనారసింహాలయం రెడీ అయింది. అద్భుత శిల్ప సౌందర్యంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా పుణ్యక్షేత్రం సుందరంగా యాదాద్రి రూపుదిద్దుకుంటోంది.
ఆలయనగరి పనులన్నీ ప్రస్తుతం తుదిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి లక్ష్మీనారసింహ ఆలయాన్ని గురువారం సందర్శించే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. సీఎం పర్యటన సంకేతాల నేపథ్యంలో అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రధాన ఆలయంతో పాటు పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నిర్మాణ పనులను ఆయన సమీక్షించనున్నారు. వీటితో పాటు నూతనంగా నిర్మించనున్న ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌, డిపోల స్థలాలను కూడా ఆయన పరిశీలించనున్నట్టు సమాచారం. ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించిన అనంతరం సమీక్షలో అధికారులకు సూచనలు, సలహాలను ఆయన ఇవ్వనున్నారు. సమీక్ష అనంతరం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ముహూర్తాన్ని నిర్ణయిస్తారని తెలుస్తోంది.
మేలో ఆలయ ఉద్ఘాటన
యాదాద్రి దివ్యాలయం.. అనుకున్నట్లుగా అద్భుతరీతిన పూర్తికాగా, ఇక ప్రారంభోత్సానికి ముహూర్తమే మిగిలిందని ఆలయవర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలోనే ముహూర్తం ఉండొచ్చని తొలుత ప్రచారం జరగ్గా, ఇపుడు మేలో ప్రారంభోత్సవ సంరంభం పక్కాగా ఉంటుందని భావిస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా సుదర్శనయాగం, దేశాధినేతలకు ఆహ్వానం , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రుత్విక్కులను తీసుకువచ్చి నిర్వహించే ప్రత్యేకపూజలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్‌, త్రిదండి చినజీయర్‌ స్వామిల సమావేశం అనంతరం తేదీపై నిర్ణయం జరగొచ్చని వైటీడీఏ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారం, పదిరోజుల్లో యాదాద్రి ప్రారంభోత్సవంపై స్పష్టత రావొచ్చని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.
800 నమూనాలు పరిశీలించి..
2015లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ఆలయ నిర్మాణాన్ని తెలంగాణ తిరుపతి తరహాలో నిర్మించేందుకు సంకల్పించగా, దేశంలోని ప్రసిద్ద ఆలయాల నమూనాలు, నిర్మాణాలు అన్ని పరిశీలించడంతో పాటు మొత్తం 800 నమూనాలను పరిశీ లించి.. చివరకు ప్రస్తుత నమూనాను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. తంజావూరు తరహాలో వెయ్యేళ్ళు చెక్కుచెదరకుండా నిర్మాణం ఉండాలని.. ఆదినుండీ సీఎం యంత్రాంగానికి నిర్దేశించడంతో పాటు అందుకుతగ్గ వనరులు సమకూర్చారు. హస్తకళానైపుణ్యంతో 54చతురస్రాకారాలతో మహా స్వర్ణద్వారం ఏర్పాటుచేశారు. ద్వారం తెరవగానే 36గంటలు ఒకేసారి మోగేలా.. తీర్చిదిద్దారు. మహాద్వారంపై 14 నారసింహమూర్తుల రూపాలను కూడా చిత్రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement