Sunday, May 19, 2024

Delhi | కులగణన అంటే ఎందుకు భయం? కేంద్రాన్ని ప్రశ్నించిన బీసీ నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కులగణన అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ, బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో చట్టసభల్లో “బీసీలకు రిజర్వేషన్లు – కులగణన” అంశాలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ ప్రదర్శనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వీహెచ్) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

కేంద్రం జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. కులగణనతో ప్రజల కంటే ప్రభుత్వానికే ఎక్కువ అవసరం ఉందని తెలిపారు. కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టు సహా అనేక హైకోర్టులు తీర్పులు ఇచ్చాయని, కేంద్ర ప్రభుత్వం మాత్రం కులగణన అంటే ఎందుకు భయపడుతుందో అర్థంకావడం లేదని అన్నారు. రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమా అన్నది చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో కులగణన చేస్తున్నా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం చేపట్టడం లేదని అన్నారు. కులగణనపై, బీసీలకు రాజ్యాధికారం దక్కేంత వరకు తమ పోరాటం కొనసాతుందని వ్యాఖ్యానించారు.

గణాంకాల ఆధారంగానే బడ్జెట్ కేటాయింపులు: వీహెచ్

అనంతరం మాట్లాడిన వీహెచ్.. అడవుల్లో ఉండే పులుల లెక్క ఉంది కానీ బీసీల లెక్కలే లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హోంమంత్రి హోదాలో రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినా సరే ఇప్పటి వరకు అమలు కాలేదని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ కులగణన చేస్తామని హామీ ఇచ్చారని, తదుపరి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తుందని తెలిపారు. పార్లమెంట్‌లో కులగణనపై నిర్ణయం తీసుకోవాలని వీహెచ్ అన్నారు.

- Advertisement -

జనాభాలో ఆగ్రభాగం బీసీలదే అయినా ఉద్యోగ పదోన్నతులు, రాజకీయాల్లో న్యాయం జరగడం లేదని తెలిపారు. కులగణనతో వాస్తవాలు బయటపడతాయని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ అందులో బీసీ కోటా లేదని, కులగణనతోనే బీసీలకు మేలు జరుగుతుందని వీహెచ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement