Saturday, May 25, 2024

మహా వికాస్‌ అఘాఢీలో లుకలుకలు?.. సంకీర్ణ ధర్మం విస్మరిస్తే తప్పుకుంటాం- కాంగ్రెస్‌

మహారాష్ట్రలో నిన్నమొన్నటివరకు అధికారం చెలాయించిన మూడు ప్రధాన రాజకీయ పక్షాలతో కూడిన మహావికాస్‌ అఘాఢీలో లుకలుకలు మొదలయ్యాయి. బుధవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మిలింద్‌ దేవర చేసిన వ్యాఖ్యలతో ఇది రూఢీ అయ్యింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ప్రకటిస్తూ శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే చేసిన ప్రకటన నేపథ్యంలో మిలింద్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో బృహణ్‌ ముంబై కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తూ శివసేన తన వైఖరిని మార్చుకుంటోందంటూ దేవర ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే సంకీర్ణ కూటమి (మహా వికాస్‌ అఘాడీ) నుంచి తప్పుకునేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఉద్ధవ్‌ సారథ్యంలోని శివసేన సంకీర్ణ ధర్మం పాటించడం లేదని మిలింద్‌ దేవర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన సారథ్యంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా శివసేనపై కఠిన వ్యాఖ్యలు చేసే మిలింద్‌ దేవర ఇప్పడు మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బలం లేకపోయినా కుయుక్తలతో అధికారంలోకి వచ్చేందుకు ఉద్ధవ్‌ సారథ్యంలోని శివసేన ప్రయత్నిస్తోందని, వార్డుల పునర్విభజన ద్వారా కుయుక్తులు పన్నుతోందని ఆరోపిస్తూ ఇటీవల కొత్తముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లకు దేవర లేఖ రాశారు. బృహణ్‌ ముంబై కార్పొరేషన్‌ దేశంలో అతి సంపన్న పురపాలక సంఘంగా ఖ్యాతి పొందింది. బీఎంసీలో ప్రస్తుతం ఎవరికీ బాధ్యత లేకుండా పోయిందని, తక్షణం ఎన్నికలు అవసరమని మిలింద్‌ డిమాండ్‌ చేశారు. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని ఉద్ధవ్‌ సారథ్యంలోని శివసేన ఆకస్మిక నిర్ణయానికి కారణం ఏమిటన్నదానిపై స్పందించిన మిలింద్‌. ఆ విషయాన్ని సంజయ్‌రౌత్‌ను అడగాలని అన్నారు. ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటు నేపథ్యంలో ఉద్ధవ్‌ ధాకరేకు మహావికాస్‌ అఘాడీ కూటమిలోని ప్రధాన పక్షాలైన, పవార్‌ సారథ్యంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయినప్పటికీ షిండే వర్గం మెజారిటీ కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఆ పరిస్థితుల్లో ఉద్ధవ్‌ వర్గం కూడా ముర్ముకే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆ కూటమినుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించడం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement