Friday, April 26, 2024

రాహుల్ వ‌రంగ‌ల్‌ టూర్‌తో కాంగ్రెస్‌కు మైలేజీ ఎంత?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన రెండు రోజుల టూర్‌పై.. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త ఒక నివేదికను సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమావేశాలకు హాజరవుతున్న సునీల్‌.. రాహుల్‌ రెండు రోజుల పర్యటన.. జన సమీకరణ.. కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన మైలేజ్‌.. రాహుల్‌ ప్రసంగంపై ప్రజల్లో వస్తున్న స్పందనతో పాటు ప్రధానంగా రైతు డిక్లరేషన్‌పై ఒక నివేదిక రూపొందించే పనిలో ఉన్నట్లుగా కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్‌ సభా వేదిక దగ్గర సునీల్‌ కూడా ఉన్నారు. అంతకు ముందు గాంధీభవన్‌లో జరిగిన ముఖ్య నేతల సమావేశాల్లోను పాల్గొన్న విషయం తెలిసిందే. పార్టీలో కష్టపడే వారికి టికెట్లు ఉంటాని, ఫైరవీలకు, వెనుక డోర్‌ నుంచి టికెట్లు తీసుకోవడానికి కాలం చెల్లిందని పార్టీ నేతలకు రాహుల్‌గాంధీ సున్నితంగానే హెచ్చిరించారు. వరంగల్‌ సభ విజయవంతమైందని, అందుకు కష్టపడిన వారిని కూడా రాహుల్‌గాంధీ అభినందింఆరు.

అయితే వరంగల్‌ సభకు ఏ జిల్లా నుంచి ఎక్కువగా జన సమీకరణ జరిగింది..? ఎంత మంది నాయకులు కష్టపడ్డారు..? షో చేసిన నాయకులు ఎంత మంది ఉన్నారు..? రైతు గర్జణ సభకు వచ్చిన నాయకుల ఫీడ్‌ బ్యాక్‌పై సమాలోచనల చేస్తున్నారు. వీటితో పాటు గాంధీభవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం, చంచల్‌గూడ జైల్‌లో ఉన్న ఎస్‌ఎస్‌యూఐ నేలను పరామర్శించడానికి వెళ్లడం, నిర్మాణలో తెలంగాణ అమరవీరుల స్థూపం సందర్శిన తదితర అంశాలపై సునీల్‌ టీమ్‌ అధ్యయనం చేసినట్లుగా సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో పార్టీ అధిష్టానానికి సునీల్‌ టీమ్‌ నివేదిక అందించే అవకాశం ఉందని సమాచారం.

అయితే రాహుల్‌గాంధీ ప్రసంగంలో ప్రస్తావనకు వ్చిన కొన్ని అంశాలు.. కొందరిని టార్గెట్‌ చేసినట్లుగా ఉన్నాయని పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. పార్టీ క్రమశిక్షణ గురించి చెబుతూనే టీఆర్‌ఎస్‌, బీజేపీలతో దోస్తీ చేసే నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి అవసరం లేదని, వాళ్లు పార్టీలో ఉండి నష్టం చేయడం కంటే స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని ఘాటుగానే హెచ్చరించారు. రాహుల్‌ చేసిన ఈ కామెంట్స్‌ పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకత్వానాకి, కేడర్‌కు బూస్ట్‌ ఇచ్చాయని కాంగ్రెస్‌ వర్గాలే చెబుతున్నాయి. అయితే కొందరు సీనియర్లు మాత్రం రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై అసంతృప్తిగా ఉన్నారనే చర్చ సాగుతోంది. వీటితో పాటు పొత్తులపై చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే టీఆర్‌ఎస్‌తో పాటు మిగతా పార్టీలతో పొత్తుల అంశాన్ని ఏ నాయకుడు కూడా మాట్లాడలేదని రాహుల్‌గాంధీకి దృష్టికి కొందరు నాయకులు తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే ) రాష్ట్రానికి వచ్చిన తర్వాతనే పొత్తులపై చర్చ జరిగిందని, కానీ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారెవ్వరు కూడా పొత్తులపై స్పందించలేదని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా పార్టీలో మరో వాదన కూడా వినిపిస్తోంది. పొత్తులపై కాంగ్రెస్‌ నేతలెవ్వరు మాట్లాడుకున్నప్పటికి.. పీకే మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా పలు పార్టీల మధ్య పొత్తులు కుదుర్చే పనిలో ఉన్నారని ప్రచారం జరడడం.. దాంతో రాహుల్‌గాంధీ క్లారిటీ ఇవ్వకపోతే మరింత నష్టం జరిగేదని, పార్టీ కేడర్‌ కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో పొత్తులపై రాహుల్‌గాంధీ స్పష్టత ఇవ్వడం వల్ల నాయకులు, పార్టీ కార్యకర్తలు నియోజక వర్గాలు, మండలాలు, గ్రామాల్లోనూ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement