Monday, May 6, 2024

గ్రేట‌ర్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మీ,. డిప్యూటీ మేయ‌ర్ గా శ్రీల‌త

హైద‌రాబాద్ – గ్రేటర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌గా బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఎన్నిక‌య్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు. మొదట మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి పేరును బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫ‌సీయుద్దీన్‌ ప్రతిపాదించారు. గాజుల‌రామారం కార్పొరేట‌ర్ ఈ ప్రతిపాదనను సమర్ధించారు. మేయ‌ర్ అభ్య‌ర్ధిత్వాన్ని టిఆర్ ఎస్ సభ్యుల‌తో పాటు ఎంఐఎం కార్పొరేట‌ర్లు కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు..దీంతో హైదరాబాద్ నూతన మేయర్‌గా విజయలక్ష్మీ పేరును ప్రకటిస్తున్నట్లు ప్రిసెడింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి తెలిపారు. నూత‌నంగా ఎన్నికైన మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మికి టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, టిఆర్ ఎస్ కు ఎంఐఎం మద్దతును వ్యతిరేకిస్తూ కౌన్సిల్ హాల్‌లో జైశ్రీరామ్ నినాదాలతో బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.. కాగా, గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా గెలిచిన విషయం విదితమే. ఎల్ఎల్‌బీ, జర్నలిజం చదివిన విజయలక్ష్మి అమెరికాలో 18 ఏళ్ల పాటు ఉన్నారు. 2007లో అమెరికా పౌరసత్వం వదులుకుని భారత్‌కు తిరిగొచ్చేశారు. మేయ‌ర్ ఎన్నిక అనంతరం మొదటిసారిగా మీడియాతో మాట్లాడిన విజయలక్ష్మి.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇకపూ హైదరాబాదీ మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తాను ఒక మహిళగా ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement