Monday, May 6, 2024

TS | అందుబాటులోకి విజయ మెగా డెయిరీ.. 5న ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రబుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) ఆధ్వర్యంలో మరో మెగా డెయిరీ సేవలు అందించేందుకు సిద్దమైంది. నూతన మెగా డెయిరీ నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. ఈ నెల 5న మధ్యాహ్నం మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా మంత్రి తలసాని యాదవ్‌ పర్యవేక్షణలో ప్రారంభోత్సవం జరుగనుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో రావిర్యాల్‌ గ్రామ పరిధిలో 40 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెగా డెయిరీని నిర్మించారు.

రోజూ 5 లక్షలా 8 లీటర్ల పాలను ప్రాసెసింగ్‌ చేయడం ఈ మెగా డెయిరీ సామర్థ్యం. ఈ డెయిరీని దేశంలోనే అత్యాధునిక, పూర్తిస్థాయి ఆటో మిషన్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీతో నిర్మించారు. ఈ ప్లాంటు నిర్వహణ కోసం సోలార్‌ విద్యుత్‌ విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థతోపాటు, వ్యర్ధాల వినియోగంతో తయారైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా నిర్మించారు. కొన్నేల్లుగా డెయిరీ కార్యకలపాలు పెద్ద ఎత్తున విస్తరిస్తున్నా హైదరాబాద్‌ కేంద్రంగానే కొనసాగుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో సేకరించిన పాలను హైదరాబాద్‌కు రవాణా చేయడం, ఉత్పత్తుల అనంతరం తిరిగి జిల్లాలకు పంపిణీ చేయడం కష్టంగా మారింది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు డెయిరీ కార్యకలాపాలను ఆరు జోన్లుగా విభజించి, వికేంద్రీకరణ విధానంలో కార్యకలాపాలను నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. ఈ విభజన ద్వారా పాల సేకరణ నుంచి ఉత్పత్తుల తయారీ వరకూ డెయిరీ సామర్థ్యం మరింత పెరగనుందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

నల్గొండ, వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నిజామాబాద్‌లో కొత్త జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జోన్లు కేంద్రంగా పాల సేకరణ చేపట్టనున్నారు. ఇకపై ఆ జోన్లలోనే పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ను చేపట్టనున్నారు. విజయ డెయిరీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కార్యాచరణ అమలు చేస్తోంది. దీంతో తెలంగాణ ఆవిర్భావ సమయంలో 64గా ఉన్న విజయ డెయిరీ దుకాణాలు (అవుట్‌ లెట్లు, పార్లర్లు) ఇప్పుడు 650కి పెరిగాయి. వీటిని వెయ్యికి పెంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

విజయ డెయిరీ ప్రస్థానం ఒడిదుడుకుల నుంచి మొదలై క్రమంగా లాభాల బాట పట్టింది. ఒకానొక దశలో మూతపడే పరిస్థితుల్లోకి వెళ్లింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. డెయిరీ మనుగడకు కీలకమైన పాడి రైతులను ప్రోత్సహించేందుకు విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు అనేక ప్రోత్సాహకులు అందజేస్తోంది. సబ్సిడీ పై పాడి గేదెల పంపిణీ, గడ్డి విత్తనాలను సరఫరా చేస్తోంది. లీటర్‌ పాలకు 4 రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement