Sunday, May 19, 2024

Delhi | చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా.. హైకోర్టులో ఉన్న పత్రాలు ఇవ్వండి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ సోమవారం (అక్టోబర్ 9)కు వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం మంగళవారం చంద్రబాబు పిటిషన్‌పై విచారణ చేపట్టగా.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ)లోని చుట్టూ వాదప్రతివాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున ప్రఖ్యాత సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూత్రా తదితరులు వాదనలు వినిపించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదోపవాదాల అనంతరం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఉన్న అన్న పత్రాలను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారం చేపడతామని చెప్పారు. మంగళవారం ధర్మాసనం ఎదుట ఉన్న కేసుల జాబితాలో చిట్టచివరన ఉన్న చంద్రబాబు పిటిషన్ మధ్యాహ్నం గం. 12.00 తర్వాత విచారణకు వచ్చింది. వర్చువల్ విధానంలో హరీశ్ సాల్వే కోర్టుకు హాజరవగా, సిద్ధార్థ్ లూత్రా, అభిషేక్ మను సింఘ్వి నేరుగా కోర్టుకు హాజరయ్యారు.

అవినీతి నిరోధక చట్టంలోని జులై 2018లో తీసుకొచ్చిన సవరణ ద్వారా చేర్చిన కొత్త సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని హరీశ్ సాల్వే వాదించారు. కేసు నమోదు చేసిన తేదీలను ప్రస్తావిస్తూ ఎఫ్.ఐ.ఆర్ నమోదు, విచారణ, అరెస్టు అన్నీ కూడా సెక్షన్ 17(ఏ) అమల్లోకి వచ్చిన తర్వాతనే జరిగాయని తెలిపారు. అవినీతి నిరోధక చట్టం కింద 2018 తర్వాత నమోదయ్యే ప్రతి కేసులో (ట్రాప్ కేసులు మినహా) సెక్షన్ 17(ఏ) వర్తిస్తుందని సాల్వే, సింఘ్వి, లూత్రా వాదించారు. కేబినెట్ నిర్ణయం ప్రకారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో ఒప్పందాలు కూడా జరిగాయని బాబు తరఫు న్యాయవాదులు తెలిపారు.

కేబినెట్ నిర్ణయాలకు ముఖ్యమంత్రి ఒక్కరే బాధ్యులు కారని సింఘ్వి అన్నారు. అధికార విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలపై చేపట్టే ప్రతీకార చర్యల నుంచి సెక్షన్ 17(ఏ) రక్షణ కల్పిస్తుందని అన్నారు. సెక్షన్ 17(ఏ)ను చేర్చిన మౌలిక ఉద్దేశాన్ని గుర్తించాలని, రాజకీయ ప్రతీకారం, కక్షసాధింపు చర్యల నుంచి రక్షణ కల్పించడం కోసమే దీన్ని తీసుకొచ్చారని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కొన్ని సందేహాలు లేవనెత్తింది. కేసులు నమోదు చేసింది 2018 తర్వాతే అయినప్పటికీ.. నేరం జరిగిన సమయం 2018కు ముందు కదా అని ప్రశ్నించింది.

ఇందుకు బదులిస్తూ.. కేసు నమోదు చేసిన తేదీనే పరిగణలోకి తీసుకోవాలి తప్ప నేరం జరిగిన సమయాన్ని కాదని తెలిపారు. గతంలో రాఫేల్ యుద్ధవిమానాల అంశంపై యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సహా మరికొన్ని తీర్పును ఉదహరించారు. ఆ ప్రకారం అవినీతి నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేపట్టే కేసుల్లో ముందస్తు అనుమతి (గవర్నర్ నుంచి) తప్పనిసరి అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సెక్షన్ 17(ఏ) చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందని సాల్వే సహా మిగతా న్యాయవాదులు వాదించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మరోసారి జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదు చేసిన సెక్షన్లతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్లు కూడా ఉన్నాయి కదా అని గుర్తుచేసింది. ఐపీసీ సెక్షన్ల విషయంలో దీన్ని ఎలా వర్తింపజేస్తాం అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు సింఘ్వి బదులిస్తూ సెక్షన్ 17(ఏ)లో పొందుపర్చిన నిర్వచనం చాలా విస్తృతమైందని, ఆ ప్రకారం ఏ నేరమైనా సరే విచారణ చేపట్టాలంటే ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని తెలిపారు.

సెక్షన్ 17(ఏ) రాక ముందు నుంచే విచారణ

చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు ప్రారంభించారు. ఈ కేసులో సెక్షన్ 17(ఏ) ప్రస్తావనే రాదని అన్నారు. 2018 జులైలో ఈ కొత్త సెక్షన్‌ను చేర్చి అమల్లోకి తెచ్చారని, ఎఫ్.ఐ.ఆర్ 2021లో నమోదైనప్పటికీ విచారణ మొదలైంది మాత్రం ఈ సెక్షన్ల అమల్లోకి రాకముందు నుంచే అని తెలిపారు. ఈ కేసులో 90 శాతం ప్రైవేట్ సంస్థ నుంచి పెట్టుబడులు వస్తాయని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 10 శాతం నిధులను ముందుగానే విడుదల చేశారని రోహత్గి చెప్పారు. వందల కోట్ల మొత్తంలో 10 శాతం నిధులు చేతులు మారి దుర్వినియోగం అయ్యాయని అన్నారు.

అయితే ఈ కేసులో మెరిట్స్ జోలికి తాము వెళ్లడం లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు. కేసు విచారణ తేదీపై వివరణ ఇస్తూ.. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ – ‘సీబీఐ’ విచారణ కోరిందని, ఆ సంస్థ విచారణ చేపట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా 2018కు ముందే విచారణ ప్రారంభమైనట్టు మీ దగ్గర ఆధారాలు, పత్రాలు ఉన్నాయా అని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని పత్రాలూ ఉన్నాయని, వాటిని తదుపరి విచారణ జరిపే సమయానికి కోర్టుకు సమర్పిస్తానని రోహత్గి వెల్లడించారు.

ఈ సమయంలో తదుపరి విచారణ అక్టోబర్ 9 (సోమవారం)కు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. సిద్ధార్థ్ లూత్రా జోక్యం చేసుకుంటూ.. చంద్రబాబు ఇంకా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, 15 రోజులు దాటిన తర్వాత దర్యాప్తు సంస్థ కస్టడీకి అప్పగించాలని కోరుతోందని చెప్పారు. బుధవారం బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టులో విచారణ కూడా ఉందని, అందుకే విచారణ తేదీని మరికాస్త ముందుకు జరపాలని కోరారు. లూత్రా అభ్యర్థనపై జోక్యం చేసుకున్న రోహత్గి, చంద్రబాబు తరఫున బెయిల్ కోసం ఒత్తిడి చేయకుండా క్వాష్ పిటిషన్ మీదనే వాదనలు వినిపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు విడుదల కోరుకునేటట్టయితే బెయిల్ కోసం వాదించుకోండి అంటూ లూత్రాకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement