Sunday, April 28, 2024

60 నిముషాలు, 4 భూకంపాలు.. వణికిన నేపాల్‌

మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భూమి కంపించడంతో ఉత్తర భారతం ఉలిక్కిపడింది. దేశ రాజధాని ఢిల్లిలో పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, ఆఫీసుల్లో ఉన్నవారందరూ భయంతో బయయకు వచ్చి రోడ్ల మీదకు వచ్చారు. దాదాపు 60 సెకండ్ల పాటు భూమి కంపిస్తుంటే ప్రాణాల్లో గుప్పిట్లో పెట్టుకొని చూస్తూ ఉండిపోయారు. కేవలం గంట వ్యవధిలో నేపాల్‌లో పుట్టిన నాలుగు భూకంపాలు కలకలం సృష్టించాయి. నేపాల్‌లో దీపయాల్‌కు ఈశాన్యంగా 8 కి.మీ.ల దూరంలో భూకంప కేంద్రం నెలకొంది.

జాతీయ సిస్మోలజీ కేంద్రం (ఎన్‌సీఎస్‌) ప్రకారం మధ్యాహ్నం 2.25 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 4.6 తీవ్రతతో మొదటి భూకంపం చోటు చేసుకుంది. ఆ తర్వాత 25 నిముషాల వ్యవధిలో 6.2 తీవ్రతతో రెండవ భూకంపం, 15 నిముషాల తర్వాత 3.8 తీవ్రతతో మూడవ భూకంపం, 13 నిముషాల తర్వాత మధ్యాహ్నం 3.19 గంటలకు 3.1 తీవ్రతతో నాల్గవ భూకంపం నేపాల్‌లో సంభవించింది.

మధ్యాహ్నం 3.27 గంటలకు అరుణాచల్‌ ప్రదేశ్‌లో 5.2 తీవ్రతతో భూకంపం, కొద్ది నిముషాల తర్వాత ఉత్తరాఖండ్‌లో 3.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఎన్‌సీఎస్‌ పేర్కొంది. అన్నింటికన్నా తీవ్రమైన భూకంపం తాలూకు కేంద్రం ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌కు ఈశాన్యంగా 206 కి.మీ.ల దూరంలో, ఉత్తరప్రదేశ్‌లో లక్నోకు ఉత్తరంగా 284 కి.మీ.ల దూరంలో నెలకొంది. 6.2 తీవ్రతతో పశ్చిమ నేపాల్‌లో రెండవ భూకంపం తలెత్తగానే ఢిల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో పాటుగా ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

- Advertisement -

ప్రజలందరూ భయాందోళనలతో ఆఫీసులు, ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భవనాల నుంచి వెలుపలకు రావాల్సిందిగా దేశరాజధాని వాసులకు ఢిల్లి పోలీసులు విజ్ఞప్తి చేశారు. లిఫ్ట్‌లు వాడవద్దని హెచ్చరించారు. భయాందోళనలకు గురికాకుండా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. అత్యవసర సాయానికి 122 నెంబరు కాల్‌ చేయాల్సిందిగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రజలు భయంతో భవనాల నుంచి పరుగులు తీస్తున్న సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

లక్నో, హాపుర్‌, అమ్రోహాలతో పాటుగా ఉత్తరప్రదేశ్‌లో 30 జిల్లాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఐదు నేపాల్‌కు సరిహద్దు జిల్లాలు. ఉత్తరాఖండ్‌లో కొన్ని ప్రాంతాలు, చండీగఢ్‌, రాజస్థాన్‌లో జైపూర్‌, ఉత్తర భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. నేపాల్‌లో ఇప్పటివరకు ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వార్తలు వెలువడలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement