Sunday, May 5, 2024

16 శాతం పెరిగిన వాహనాల అమ్మకాలు

ఆటో మొబైల్‌ రిటైల్‌ అమ్మకాలు ఫిబ్రవరి నెలలో 16 శాతం పెరిగాయి. వివాహల సీజన్‌ కావడంతో అమ్మకాలు పెరిగాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఏడీఏ-ఫెడా) తెలిపింది. కోవిడ్‌కు ముందున్న అమ్మకాల కంటే ఇంకా తక్కువగానే నమోదయ్యాయని పేర్కొంది. కోవిడ్‌కు ముందు 2020 ఫిబ్రవరి నెలలో జరిగిన అమ్మకాలతో పోల్చితే 2023 ఫిబ్రవరిలో 8 శాతం అమ్మకాలు తక్కువగా నమోదయ్యాయని ఫెడా తెలిపింది. వార్షిక ప్రాతిపదిన కొన్ని రకాల వాహనాల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. టూ వీలర్స్‌ అమ్మకాలు 15 శాతం, త్రీ వీలర్స్‌ అమ్మకాలు 81 శాతం, ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు 11 శాతం, ట్రాక్టర్ల అమ్మకాలు 14 శాతం, వాణిజ్య వాహనాల అమ్మకాలు 17 శాతం పెరిగాయని తెలిపింది. కోవిడ్‌ కంటే ముందు 2020 ఫిబ్రవరి నెలలో జరిగిన అమ్మకాల కంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన టూ వీలర్స్‌ అమ్మకాలు 14 శాతం తగ్గాయి.

ఈ సంవత్సరం ఆన్‌ బోర్డు డయాగ్నిస్టిక్స్‌ నిబంధనలు అమల్లోకి వస్తుండటం, పెళ్లిళ్ల సీజన్‌ మూలంగా ఫిబ్రవరిలో అమ్మకాలు పెరిగాయని ఫెడా ప్రెసిడెంట్‌ మనీష్‌ రాజ్‌ సింఘానియా తెలిపారు. త్రీ వీలర్స్‌ సె గ్మెంట్‌ అమ్మకాలు మాత్రం అత్యధికంగా 81 శాతం వృద్ధిని నమోదు చేసింది. కోవిడ్‌ కంటే ముందు అమ్మకాలతో పోల్చితే 3 శాతం పెరిగాయి. ప్రధానంగా ఆకర్షణీయమైన ఫైనాన్స్‌ స్కీమ్స్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు, భారీ ప్రచారం వంటి అంశాలు అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 11 శాతం పెరిగాయి. కోవిడ్‌ ముందు 2020 ఫిబ్రవరి నెలతో పోల్చితే 16 శాతం పెరిగాయి. ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో ప్రధానంగా కంపెనీలు అనేక కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకు రావడం, బుకింగ్‌-కాన్సిలేషన్‌ రేషియో బాగా తగ్గిపోవడం, పెళ్లిళ్ల సీజన్‌ ఇలా అనేక అంశాలు కలిసి వచ్చాయని సింఘానియా అభిప్రాయపడ్డారు.

ఈ ఫిబ్రవరిలో కమర్షియల్‌ వాహనాల అమ్మకాలు ఘణనీయంగా పెరిగి 17 శాతంగా నమోదయ్యాయి. 2020 ఫిబ్రవరితో పోల్చితే మాత్రం ఇంకా 10 శాతం అమ్మకాలు తక్కువగా నమోదయ్యాయి. మార్చి నెలలో వాహనాల అమ్మకాలు మరింతగా పెరుగుతాయని ఫెడా అభిప్రాయపడింది. మార్చిలో హోలి, ఉగాది, గుడి పావడా, నవరాత్రి ఇలా పలు పండుగలు ఉన్నాయని తెలిపింది. చిప్‌ సరఫరాలు చాలా వరకు మెరుగుపడటంతో అన్ని కంపెనీలు ఉత్పత్తిని భారీగా పెంచాయని, దీని వల్ల డెలివరీకి వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయని సింఘానియా తెలిపారు. ఏప్రిల్‌ నుంచి కొత్త నిబంధనల వల్ల వాహనాల రేట్లు పెరుగుతాయని, అందు వల్ల మార్చిలో కంపెనీలు డిస్కౌంట్లు పెంచడంతో పాటు, ఉన్న అన్ని వాహనాలను అమ్మేందుకు భారీగా ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నాయని ఆయన తెలిపారు. టూవీలర్స్‌లో హీరో మోటోకార్ప్‌ మార్కెట్‌ వాటా 2022 ఫిబ్రవరి లో 31.55 శాతంగా ఉంటే, ఈ ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి 30.83 శాతంగా ఉంది.

- Advertisement -

హోండా మోటార్స్‌, టీవీఎస్‌ మోటార్‌ టూ వీలర్స్‌ గత సంవత్సరం ఫిబ్రవరితో పోల్చితే, ఈ సారి ఫిబ్రవరిలో అమ్మకాలు పెరిగాయి. త్రీ వీలర్స్‌లో బజాజ్‌ ఆటో తన లీడర్‌ షిప్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలోఓ35.27 శాతం అమ్మకాలు జరపగా, ఈ సారి 37.9 శాతానికి అమ్మకాలు పెరిగాయి. వాణిజ్య వాహనాల విభాగంలో టాటా మోటార్స్‌ అమ్మకాలు తగ్గాయి. గత ఏడాది ఫిబ్రవరిలో టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల అమ్మకాలు 42.13 శాతంగా ఉంటే, ఈ సారి అది 38.32 శాతంగా ఉంది. ఈ విభాగంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా వాహనాల అమ్మకాలు 23.85 శాతం, అశోక్‌ లేలాండ్‌ అమ్మకాలు 16.87 శాతంతో టాప్‌ త్రీలో ఉన్నాయి. ప్యాసింజర్‌ కార్ల విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా ఉన్న మారుతీ సుజుకీ అమ్మకాలు గత ఏడాది ఫిబ్రవరిలో 42.36 శాతం నుంచి 41.4 శాతానికి తగ్గాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement