Wednesday, May 8, 2024

మార్చిలో భారీగా వాడేశారు, రికార్డు స్థాయిలో ఇంధన వినియోగం

ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కానీ వినియోగం మాత్రం అస్సలు తగ్గడం లేదు. కొన్ని నగరాల్లో తాజాగా పెట్రోల్‌, డీజెల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయినా మార్చిలో ఇంధన వినియోగం భారీగా జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ ప్రకారం.. 2019 మార్చి నుంచి ఇదే అత్యధిక వినియోగం అని ప్రకటించింది. మార్చి నెలలో 19.41 మిలియన్‌ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం జరిగిందని ప్రకటించింది. కరోనా మహమ్మారి నుంచి దేశం బయటపడింది. దీంతో ఇంధన వినియోగం భారీగా పెరిగినట్టు తెలుస్తున్నది. 2022 మార్చిలో 7.7 మిలియన్‌ టన్నుల డీజెల్‌ విక్రయాలు జరిగాయి. కరోనా కంటే ముందు నాటి రికార్డు గత మార్చిలో బద్దలైంది. వ్యవసాయ రంగంలో డీజెల్‌ వినియోగం భారీగా పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి.

దీనికితోడు ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత.. ఇంధన ధరలు పెరుగుతాయన్న కారణంగా కూడా చాలా మంది భారీగా ఇంధనాన్ని నిల్వ చేసుకున్నట్టు తెలుస్తున్నది. మార్చిలో వంట గ్యాస్‌ డిమాండ్‌ 9.8 శాతం పెరిగి.. 2.48 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంధన వినియోగం 202.72 మిలియన్‌ టన్నులుగా రికార్డయ్యింది. 2020 ఆర్థిక సంవత్సరం తరువాత.. ఇదే అత్యధికం. 2021-22లో పెట్రోల్‌ వినియోగం 10.3 శాతం పెరిగి.. 30.85 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. డీజెల్‌ మాత్రం 5.6 శాతం పెరిగి.. 76.7 మిలియన్‌ టన్నుల విక్రయాలు జరిగాయి. గత మూడేళ్లలో వీటి అమ్మకాల్లో ఇవే గరిష్టం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement