Monday, April 29, 2024

అగ్రరాజ్యాన్ని కలవరపెట్టిన చిన్నారి ట్వీట్

ఓ ట్వీట్ అగ్రరాజ్యాన్ని హడలెత్తించింది. అది సీక్రెట్ కోడ్ అనుకుని అప్రమత్తమైంది. సాధారణంగా ఉగ్రవాదులు, దేశద్రోహులు, భద్రతా దళాలు తమ ఆపరేషన్స్ కోసం సీక్రెట్ కోడ్స్‌ ఉపయోగిస్తుంటారు. అయితే సెక్యూరిటీ బలగాలు నిత్యం అలర్ట్‌గా ఉంటూ ఉగ్రవాదుల కోడ్స్‌ను డీకోడ్ చేస్తుంటాయి. ఈ మేరకు ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే అలర్ట్ అయిపోతారు. ఈ నేపథ్యంలో యూఎస్ స్ట్రాటజిక్ కమాండ్ అధికారిక ఖాతాలో పోస్ట్ అయిన ‘;l;;gmlxzssaw’ అనే పదం యావత్ అమెరికాను హడలెత్తించింది. పైగా దేశభద్రతకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే సంస్థ కావడంతో ఈ పదం ఏంటని అధికారులు అప్రమత్తమయ్యారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు.. ఖాతా హ్యాక్ అయ్యుండొచ్చునని భయపడ్డారు. ఇంకొంతమంది న్యూక్లియ‌ర్ లాంచ్ కోడ్ కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇంతకీ ఆ ట్వీట్ ఎవరు చేశారో తెలుసా?
సోషల్ మీడియా మేనేజర్ కుటుంబానికి చెందిన ఓ చిన్నారి పొరపాటున ఈ ట్వీట్ చేసిందని తెలుసుకుని సదరు సంస్థ ఊపిరి పీల్చుకుంది. ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించడంతో పాటు మళ్లీ అసలు విషయాన్ని ట్వీట్ చేయడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పింది. భద్రతను పర్యవేక్షించే సంస్థ నుంచి ఇలాంటి పొరపాటు ట్వీట్లు రావడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన నెటిజన్లు.. ‘ఫ్లీటింగ్ మూమెంట్స్.. ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మిలిటరీని ఓ చిన్నారి నియంత్రించింది, ఇది అద్భుతం.. అచ్చం మెన్ ఇన్ బ్లాక్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌లా అనిపిస్తోంది. సందేశాన్ని డీకోడ్ చేసిన వారు ఏడాది వరకు ఏజెంట్ కెతో శిక్షణ పొందుతారు’ అంటూ కామెంట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement