Wednesday, May 15, 2024

TS | పార్టీ వీడే యోచనలో బీజేపీ అసంతృప్త నేతలు.. బీఆర్‌ఎస్‌లో చేరికపై కొలిక్కి వచ్చిన చర్చలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొద్దికాలంగా బీజేపీ నాయకత్వంపై గుర్రుగా ఉన్న అసంతృప్త నేతల్లో ఒక్కొరొక్కరుగా పార్టీని వీడేందుకే సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుస రహస్యభేటీలు నిర్వహిస్తున్న బీజేపీలోని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ఇక పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. ఇప్పటికే మూడు సార్లు బీజేపీ అసంతృప్త నేతలు రహస్యంగా కీలక భేటీలు నిర్వహించారు. సోమవారం నగర శివారులోని మొయినాబాద్‌ ఫాంహౌజ్‌ కేంద్రంగా అసంతృప్త నేతలు కీలక రహస్య భేటీ నిర్వహించారు. ఈ భేటీలోనే బీజేపీని వీడాలని వారు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీని వీడాలని నిర్ణయించిన అసంతృప్త నేత ల్లో అయిదుగురు మరోమారు మంగళవారం హైదరాబాద్‌ వేదికగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇక పార్టీ వీడాలన్న తుది నిర్ణయానికి వారు వచ్చినట్లు తెలిసింది.

పార్టీని వీడాలని అంతిమ నిర్ణయానికి వచ్చిన అసంతృప్త నేతల్లో మెజారిటీ నేతలు అధికార బీఆర్‌ఎస్‌లో చేరేందుకే మొగ్గు చూపినట్లు తెలిసింది. వీరిలో ఒకరిద్దరు మాత్రమే కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోగా మరో నలుగురు నేతలు బీఆర్‌ఎస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌లో తమ చేరికకు సంబంధించి ఆ నేతలు పూర్వరంగాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌లో చేరబోతున్న అసంతృప్త నేతల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఓ రిజర్వ్‌డ్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆ మాజీ ఎంపీ స్పీడ్‌గా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఒకరితో మూడుసార్లు చర్చలు జరిపినట్లు తెలిసింది.

ఈ చర్చల్లో తనకు ఎంపీ, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలో ఏదో ఒక పదవి విషయంలో బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం నుంచి ఆయన స్పష్టమైన హామీని కూడా పొందినట్లు తెలుస్తోంది. రేపో, మాపో అధికారికంగా ఆయన బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటారని, ఆయన చేరిక కార్యక్రమం ప్రగతి భవన్‌ వేదికగానే జరుగుతుందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే పార్టీ మారే విషయమై వస్తున్న ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన ఖండిస్తూనే వస్తున్నారు. అదే సమయంలో బీజేపీలో ఆయన సంతృప్తిగా ఉన్న దాఖలాలుకూడా లేవు. అసంతృప్త నేతల టీంను ఆయనే లీడ్‌ చేస్తున్నారు. మూడుసార్లు జరిగిన బీజేపీలోని మాజీ ఎంపీల రహస్య భేటీలను ఆయన ముందుండి నడిపించారు. ఇప్పటికే ఆ మాజీ ఎంపీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో పనిచేశారు. ఒక్క సెప్టెంబరు నెలలోనే ఆ మాజీ ఎంపీ బీజేపీని వీడుతున్నట్లు రెండు, మూడు సార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి ఆయన ఆ వార్తలను నిజం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త, ఉద్యమకారుల కుటుంబం నుంచి వచ్చిన ఓ ఎంపీ కూడా బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ నాయకత్వంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అయితే తనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే తాను బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమని ఆయన చర్చల సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లోనే ఆ మాజీ ఎంపీకి కూడా బీఆర్‌ఎస్‌ నుంచి స్పష్టమైన హామీ వస్తుందని, ఆయన కూడా కమలం పార్టీని వీడడం ఖాయమని చర్చ సాగుతోంది. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేరుపొందిన సోదర ద్వయంలోని ఓ మాజీ ఎంపీ కూడా బీఆర్‌ఎస్‌ నేతలతో ట చ్‌లో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికలో తాను ఓడిపోయిన స్థానం నుంచి తనకు టికెట్‌ ఇస్తే గులాబీ కండువా కప్పుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరంలేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

ఆయన ప్రతిపాదనపై బీఆర్‌ఎస్‌ సానుకూలంగా స్పందించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నేత ఒకరు కూడా బీజేపీని వీడి కారు ఎక్కేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన కూడా బీఆర్‌ఎస్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఏదైనా కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పదవి లేదంటే నామినేటెడ్‌ పోస్టును ఆయన ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే… తెలంగాణ రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన ఓ మహిళా మాజీ ఎంపీ మాత్రం బీఆర్‌ఎస్‌ వైపు కాకుండా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా కాంగ్రెస్‌ నాయకత్వంతో ఇప్పటికే చేరిక విషయమై పలుమార్లు చర్చించినట్లు సమాచారం. ఆమె చేరికపై టీ. కాంగ్రెస్‌ చీఫ్‌ కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా… కొద్దికాలంగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై పలువురు మాజీ ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. ఈ ఒక్కనెలలోనే వారు మూడు సార్లు రహస్య భేటీ నిర్వహించారు. రాష్ట్ర నాయకత్వం ఏకపక్ష వైఖరితో ముందుకు వెళుతోందని, తమకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండానే తమ ప్రాంతానికి చెందిన నేతలను బీజేపీలోకి చేర్చుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. పక్షం రోజుల్లోనే వారు మూడుసార్లు రహస్య భేటీ అయ్యారు. బీజేపీలోని అసంతృప్త నేతలకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ద్వారాలు తెరిస్తే అసెంబ్లిd ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తెలంగాణలో బీజేపీకి కోలుకోలేని దెబ్బతగలడం ఖాయమన్న విషయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అక్టోబరు 1, 3 తేదీల్లో ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆలోపే బీజేపీలోని అసంతృప్త నేతలను చేర్చుకుని ప్రధాని మోడీకి, బీజేపీ అధిష్టానానికి గట్టి షాక్‌ ఇచ్చే వ్యూహంలో ఇటు కాంగ్రెస్‌, అటు బీఆర్‌ఎస్‌ వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement