Wednesday, May 8, 2024

Delhi | కాళేశ్వరం మీద అనవసర రాద్ధాంతం.. విపక్షాలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు అందజేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాదా? ఇదే విషయాన్ని చెబితే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రజా అంశాలు చర్చకు రాకుండా ప్రతిపక్ష కూటమి అడ్డుకుందని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ గొడవకు వత్తాసు పలికి బీఆర్ఎస్ అవిశ్వాసంలో ఆ పార్టీతో కలిసి నడిచిందని విమర్శించారు.

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమయంలో సభలో లేని విపక్షాలు అవిశ్వాసం పెట్టడం దేనికని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ తోక పార్టీలుగా బీఆర్ఎస్, మజ్లిస్ కూడా వాకౌట్ చేశాయని, అవిశ్వాస తీర్మానం పెట్టి చివరి వరకు లేకుండా పారిపోవడం చరిత్రలో బహుశా ఇదే మొదటిసారని అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాలు బొక్క బోర్ల పడ్డాయని, అభాసుపాలయ్యాయని ఎంపీ ఎద్దేవా చేశారు.

- Advertisement -

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం ఢిల్లీలో బహిర్గతమైందని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయడానికి బీజేపీ మాత్రమే ఏకైక ప్రత్యమ్నాయని ఎంపీ నొక్కిచెప్పారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, ప్రత్యామ్నాయంగా అభివృద్ధి ఎజెండాను ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను ఇప్పటిదాకా నిర్మించి పేదలకు ఇవ్వలేకపోయిన బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి బండి సంజయ్ మాట్లాడారని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement