Wednesday, May 8, 2024

కేంద్రమంత్రి అజయ్ మిశ్రాపై వేటు లేనట్టే

న్యూఢిల్లీ : లఖీంపూర్ ఖేరీలో వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమిస్తున్న ఆందోళనకారులపైకి వాహనం దూసుకువెళ్లిన దుర్ఘటన కుట్రపూరితమని ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనిను మంత్రివర్గం నుండి తొలగించాలన్న డిమాండ్ ను ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైతులపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందన్న సిట్ మాటే తుది తీర్పు కాదని, అందువల్ల మంత్రిపై ఎటువంటి చర్య తీసుకోనవసరం లేదని అధికార బీజేపీ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మంత్రి తనయుడు ఆశిషే కానీ అజయ్ మిశ్రా కాదని ఆ వర్గాలు వాదిస్తున్నాయి.

లఖీంపూర్ ఖేరీ దుర్ఘటనపై సిట్ నివేదిక సమర్పించిన అంశాన్ని ప్రస్తావించినప్పుడు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా చిందులు తొక్కిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కేంద్రం ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేదు. ఎప్పటిలా ఆయన గురువారం నాడుకూడా విధుల్లో పాల్గొన్నారు. అధికారుల బృందాలతో విడివిడిగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ ఏడాది అక్టోబర్ 3న యూపీలోని లఖీంపూర్ కేరీ వద్ద అందోళన చేస్తున్న రైతులపైకి ఎస్ యూ వీ వాహనం దూసుకెళ్లిన దుర్ఘటనలో ఒక జర్నలిస్ట్ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిత్రాపై మోపిన నేరాభియోగాలను సవరించాలని, ప్రణాళిక ప్రకారం పన్నిన కుట్రగా మార్చాలని ప్రత్యేక దర్యాప్తు బృందం న్యాయస్థానాన్ని కోరింది. దీంతో అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తప్పించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement