Monday, April 29, 2024

రాజకీయాలకు మెట్రోమ్యాన్ శ్రీధరన్ గుడ్ బై.. రాజ‌కీయ‌వేత్త‌ను కాలేక‌పోయాన‌ని కామెంట్‌..

మల్లప్పురం: దాదాపు ఏడాది క్రితం భారతీయ జనతా పార్టీలో చేరిన మెట్రోమ్యాన్ ఇ. శ్రీధరన్ క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కేరళలోని మలప్పురం గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏప్రిల్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమినుంచి గుణపాఠం నేర్చుకున్నానని, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ వేదికలే అవసరం లేదని తెలిసొచ్చిందని ఆయన అన్నారు. 90 ఏళ్ల వయసులో రాజకీయాలు ప్రమాదకరమైనవని, ఇప్పటికే మూడు ట్రస్ట్ ల ద్వారా ప్రజలకు ఏం చేయాలో చేస్తున్నానని, ఒకవేళ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ ఒంటరిగా చేసేది ఏమీ ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. నేనెప్పటికీ రాజకీయ నేతను కాలేనని కరాఖండిగా చెప్పారు.

బీజేపీ వేదికగా రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి సిద్ధమంటూ శ్రీధరన్ ప్రకటించారు. అయితే, ఏప్రిల్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీధరన్ సిట్టింగ్ శాసనసభ్యుడు షఫీ పరంబీల్ పై 3,859 ఓట్ల తేడాతో ఓటమిపాలైనారు. ఆ ఓటమి తనను నిరాశపరిచిందని ఒప్పుకున్న మెట్రోమ్యాన్ రాజకీయాల్లో ఏదో సాధించాలన్న కలలేమీ తనకు లేవని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement