Tuesday, April 30, 2024

ప్రయాణికులకు మరింత చేరువగా టీఎస్‌ ఆర్టీసీ.. 3 నెలల్లో అందుబాటులోకి 1020 కొత్త బస్సులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రయాణికులకు చేరువయ్యే దిశగా టీఎస్‌ ఆర్టీసీ కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నది. చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీగా విసి సజ్జన్నార్‌ బాధ్యతలు స్వీకరించిన తరువాత సంస్థను లాభాల బాట పట్టించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా రానున్న మూడు నెలల్లో 1020 కొత్త బస్సులు రాష్ట్రంలోని రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఆర్టీసీ యాజమాన్యమే ఈ బస్సులను సొంతంగా కొనుగోలు చేయనుంది. వీటిలో 720 సూపర్‌ లగ్జరీ బస్సులను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పంపించనున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న పాత బస్సులను మియాపూర్‌ బస్‌ బాడీ బిల్డింగ్‌ స్టేషన్‌కు తరలించి నగర రోడ్లకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి సిటీ బస్సులుగా మార్పు చేయనున్నారు.

అలాగే, సూపర్‌ లగ్జరీ బస్సులకు తోడుగా మరో 300 ఎలక్ట్రిక్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నడిపించనుంది. కాగా, టీఎస్‌ ఆర్టీసీ నష్టాల బాటను వీడి ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పయనిస్తుండటంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో విద్యార్థులకు కొంత మేర ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సిటీ బస్సుల్లో వసూలు చేస్తున్న విద్యార్థుల మెట్రో కాంబినేషన్‌ టికెట్‌ చార్జీని రూ.20ల నుంచి రూ.10కి తగ్గించారు. హైదరాబాద్‌ నగరంలోని సిటీ బస్సుల్లో విద్యార్థుల రాయితీ బస్‌పాస్‌లు కేవలం ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో ఎక్కాలంటే రూ.20 చెల్లించి కాంబో టికెట్‌ తీసుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ టికెట్‌ ధరను రూ.10కి తగ్గించి కాంబినేషన్‌ టికెట్‌తో మెట్రో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చారు.

అలాగే, దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ విద్యార్థుల గ్రేటర్‌ హైదరాబాద్‌ బస్‌పాస్‌లను పరిమితి వరకు అనుమతించాలని ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర శివార్లలో సిటీ బస్సులు తక్కువగా తిరుగుతున్న కారణంగా విద్యార్థులు ప్రైవేటు బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఆర్టీసీ బస్‌పాస్‌ ఉన్న విద్యార్థులను పల్లె వెలుగుతో పాటు ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఇటీవల ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement