Wednesday, April 24, 2024

ప్రలోభాలకు లొంగిపోకండి.. ఆ పార్టీలో భవిష్యత్తు ఉండదు : వీహెచ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అసంతృప్త నేతలను చేర్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయోగిస్తున్న ‘ఆపరేషన్ లోటస్’కు ఆకర్షితులు కావొద్దని తమ పార్టీ నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వీహెచ్, కాంగ్రెస్‌లో అసంతృప్తులకు బీజేపీ గాలమేస్తోందని ఆరోపించారు. అందుకే ఆ పార్జీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్‌లో మకాం పెట్టారని, సిట్ కేసులో సమన్లు పంపితే రాని వ్యక్తి ఇప్పుడు ఏకంగా పార్టీలో చేరికల కోసం హైదరాబాద్‌లో మంతనాలు సాగిస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. బీజేపీ మనుధర్మాన్ని ఆచరించే పార్టీ అని, అలాంటి పార్టీలో దళితులకు, గిరిజనులకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదని అన్నారు. పేరుకు మాత్రమే రాష్ట్రపతి వంటి పదవుల్లో ఆదివాసీ మహిళను కూర్చోబెట్టారని అన్నారు.

ఆ పార్టీలో కొత్తగా చేరినవారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని, మొదటి నుంచీ ఉన్నవాళ్లకు, ఆరెస్సెస్ నేపథ్యం కలిగినవారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తారని చెప్పుకొచ్చారు. తొందరపడి ఆ పార్టీలో చేరి భవిష్యత్తు పాడుచేసుకోద్దని సొంత పార్టీ నేతలకు హితవు పలికారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో సమస్యలు ఉంటే అధిష్టానంతో మాట్లాడుకుని చర్చించుకుందామని, బీజేపీ ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలో చేరవద్దని విజ్ఞప్తి చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement