Thursday, May 9, 2024

డేంజర్‌ జోన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు..

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : హైదరాబాద్‌ మహా నగరంలో 55 లక్షలకు పైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా వాటికి విద్యుత్‌ సరఫరా కోసం లక్షా 30 వేలకు పైగా డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. వీటి నిర్వాహణ కోసం సెక్షన్‌, సబ్‌డివిజన్‌, డివిజన్‌, సర్కిల్‌ కార్యాలయాలు ఉన్నాయి. 9 సర్కిళ్ళు, 25 డివిజన్ల పరిధిలో లక్షా 30 వేలకు పైగా డీటీఆర్‌లలో సగానికి పైగా రక్షణ వలయం లేకపోవడంతో ప్రమాదం అంచుల్లో ఉన్నాయి. బస్తీలు, కాలనీలలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు ఉన్నాయి.

నగరంలోని జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, చాంద్రాయణగుట్ట, కూకట్‌పల్లి, హయత్‌నగర్‌, చంపాపేట, సికింద్రాబాద్‌, మేడ్చల్‌, కొండాపూర్‌, బేగంపేట, సీతాఫల్‌మండి వంటి చాలా ప్రాంతాలలో ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌ మహా నగరంలో గృహాలకు అతి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లతో ఎప్పుడు ఏలాంటి ప్రమాదం ముంచుకోస్తుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల కింద ఏర్పాటు చేసిన ఫ్యూజ్‌ బాక్స్‌లకు మూతలు లేకపోవడమే కాకుండా అవి చిన్న పిల్లలకు అందే ఎత్తులో ఉండడం గమనార్హం. రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టు చెత్తా చెదారం నిండిపోవడం, రక్షణ వలయం లేక పోవడంతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం చెత్తా చెదారం నిండి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మూత్ర విసర్జనకు వెళ్ళిన వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఇలాంటి వాటిని మార్చాలని అప్పట్లో యాజమాన్యం నిర్ణయం తీసుకున్నప్పటికి ఆ తర్వాత మర్చిపోయారు. ప్రమాదంజరిగినప్పుడే పరుగులు పెట్టడం గమనార్హం. వర్షాకాల ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వాహణ కోసం నిధులు మంజూరు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement