Friday, May 3, 2024

బదిలీలు చేయరు, బాధలు తీర్చరు.. స్పౌజ్​ బదిలీలకు 9 నెలలుగా వెయిటింగ్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నూతన జిల్లాలకు 317 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టీచర్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టి దాదాపు తొమ్మిది నెలలు కావొస్తున్నా టీచర్ల బదిలీల ప్రక్రియ ఇంకా అసంపూర్తిగానే మిగిలి ఉంది. ఇంత వరకు ఓ కొలిక్కి రాలేదు. అలాగే స్పౌజ్‌ టీచర్ల బదిలీల ప్రక్రియను 19 జిల్లాల్లో చేపట్టిన విద్యాశాఖ మిగిలిన 13 జిల్లాల్లో మాత్రం ఇంకా బ్లాక్‌ లిస్టులోనే పెట్టింది. ఈ 13 జిల్లాల్లోనూ స్పౌజ్‌ అప్పీళ్లు చేపట్టాలని టీచర్లు గత కొంత కాలంగా ఆందోళనలు చేపడుతున్నా వాటిని ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 13 జిల్లాల్లోనూ స్పౌజ్‌ అప్పీళ్లను చేపడితే అక్కడి పోస్టులను ఆ జిల్లా యువత కోల్పోవలసి వస్తుందనేది ప్రభుత్వ వాదన. దాంతో న్యాయపరమైన చిక్కులేకాకుండా ఆ జిల్లాలోని యువత భవిష్యత్తులో ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలోనే 13 జిల్లాల్లో స్పౌజ్‌ బదిలీలను పెండింగ్‌లో పెట్టినట్లుగా వారు పేర్కొంటున్నారు. టీచర్లు మాత్రం ప్రభుత్వ వాదనలో వాస్తవంలేదని కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు తమ అప్పీళ్లను పరిష్కరించాలంటూ 317 జీవో అమలుకు వ్యతిరేకంగా వేలాది మంది టీచర్లు ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కారు. తమ సీనియారిటీ కోల్పోయామని? స్థానికత కోల్పోయామని? తమ ఆరోగ్యం బాగోలేదని? తదితర కారణాలతో తమకు బదిలీలు చేపట్టాలని చాలా మంది పిటిషిన్లను న్యాయస్థానంలో ఇంకా దాఖలు చేస్తునే ఉన్నారు. దాంతో ఈ స్పౌజ్‌ బదిలీల లొల్లి ఇప్పట్లో తేలేటట్లుగా కనబడటం లేదు.

ఐదారేళ్లు పట్టే అవకాశం….

317 జీవో అమలు కారణంగా పాఠశాల విద్యాశాఖ అధికారులకు కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. దీంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రతి రోజు ఎవరో ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు తమకు అన్యాయం జరిగిందని కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. దాంతో వేలాది కేసులు కోర్టులో దాఖలవుతున్నాయి. ఇందులో 317 జీవో తీసుకొచ్చిన లొల్లే ఎక్కువగా ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. చాలా మంది టీచర్లు తమకు సీనియారిటీలో అన్యాయం జరిగిందని, తాము స్థానికతను కోల్పోతున్నామని, భార్యబధర్తల కేటగిరీ (స్పౌజ్‌), వితంతువు, అంగవైకల్యం, అనారోగ్య కారణంగా తమకు అనుకున్న జిల్లాకు బదిలీలు చేపట్టాలని తదితర కారణాలతో వేసిన దాదాపు 3500కు వరకు కేసులు విచారణలో ఉన్నట్లు సమాచారం. ఒక్కో కేసు పరిష్కారమవుతున్న కొద్ది మళ్లి ఎవరో ఒకరు తమకు న్యాయం జరగలేదంటూ పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేస్తునే ఉన్నారని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో తమకు రోజూ వారి ఆఫీసు పనులకు తోడూ ఈ కేసుల లొల్లి ఎక్కువైందని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

12వేల అప్పీళ్లలో సగం తిరస్కరణకు…

రాష్ట్రంలో దాదాపు 1.06 లక్షల మంది టీచర్లు పనిచేస్తుండగా అందులో దాదాపు 24500 మంది నూతన జిల్లాలకు మారారు. వీరిలో 12 వేల మంది తమకు అన్యాయం జరిగిందని వివిధ కారణాలను చూపుతూ విద్యాశాఖకు అప్పీళ్లు చేసుకున్నారు. వీటిలో సగానికిపైగా దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. స్పౌజ్‌ కేసులను పరిష్కరించడం ద్వారా ఆయా జిల్లాల్లో పోస్టులు తగ్గిపోతాయని విద్యాశాఖ పేర్కొంటుంది. ఇందులో భాగంగానే సూర్యాపేట, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, మేడ్చల్‌, సిద్ధిపేట, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో స్పౌజ్‌ బదిలీలను ప్రభుత్వం చేపట్టలేదు. మిగిలిన జిల్లాల్లో మాత్రం దాదాపు 1155 మంది వరకు పోస్టింగులు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement