Sunday, May 19, 2024

పునరుత్పాదక ఇంధన రంగంలో వేలాది ఉద్యోగాలు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పునరుత్పాదక ఇంధన రంగంలో దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగావకాశలు కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌లను నెలకొల్పడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగావకాశాల కల్పన ఏ మేరకు జరిగిందని ప్రశ్నించారు. దీనికి పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భగవంత్‌ కూబా మంత్రి జవాబిస్తూ సౌర ఇంధన విభాగంలో మూడు మార్గాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మానవ వనరుల శిక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా 62,340 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

100 అత్యున్నత విద్యా సంస్థలలో ఎంటెక్‌, పీహెచ్‌డీ అభ్యర్ధుల కోసం జాతీయ పునరుత్పాదక ఇంధన ఫెలోషిప్‌ స్కీమ్‌ను అమలు చేస్తున్నట్లు, సూర్య మిత్ర పథకం కింద 50,806 మందికి శిక్షణ ఇవ్వగా అందులో 53 శాతం మందికి ఉద్యోగాల కల్పన జరిగిందని ఆయన వివరించారు. వరుణ్‌ మిత్ర పథకం కింద సోలార్‌ వాటర్‌ పంప్‌ టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వాయు మిత్ర పథకం కింద పవన విద్యుచ్ఛక్తిలో టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చినట్లు, సోలార్‌ ఇంధన రంగంలో ఇప్పటికి దేశంలో 11,500 మెగావాట్ల స్థాపిత సామర్ధ్యానికి చేరుకోగా ప్రతి మెగా వాట్‌కు 2.6 మంది ఉద్యోగాల కల్పన జరిగిందని పేర్కొన్నారు. మొత్తం మీద 29,900 మందికి సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు మంత్రి వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement