Tuesday, May 14, 2024

Delhi: రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి.. పర్యాటక ప్రాంతాలు, పండుగలను మార్కెటింగ్ చేయండి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధరంశాలలో జరుగుతున్న వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో రెండోరోజు ఆయన అక్కడి ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళ్ నాడు, మిజోరాం, బీహార్, అస్సాం, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, రాజస్థాన్, కర్ణాటక, మణిపూర్, సిక్కిం రాష్ట్రాల మంత్రులు, కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

తమ రాష్ట్రాల్లో జరుగుతున్న పర్యాటకాభివృద్ది, సమస్యల గురించి చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున టూరిజం ఎండీ మనోహర్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… కోవిడ్ కారణంగా ప్రభావితమైన పర్యాటక రంగాన్ని మళ్లీ పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పర్యాటక రంగాభివృద్ధి కేవలం కేంద్రం బాధ్యత మాత్రమే కాదన్న ఆయన, ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిదని చెప్పారు. పార్టీలు వేరైనా ముఖ్యమంత్రులు తనతో పర్యాటక రంగం గురించి చర్చిస్తుంటారని, రాష్ట్రాలు కొత్త కార్యక్రమాలు చేయడానికి పోటీ పడాలని ఆయన పిలుపునిచ్చారు.

టూరిజం శాఖకు బడ్జెట్ తక్కువన్న కేంద్రమంత్రి, ప్రధానమంత్రి సూచనల మేరకు అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే రంగమిదేనని ఆయన చెప్పుకొచ్చారు. పౌర విమానయాన, రోడ్లు, విద్యా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.

న్యూజిలాండ్ కంటే హిమాచల్ కు ఏం తక్కువ కాదని, అయినా మన టూరిస్టులు ఇక్కడి పర్యాటక ప్రాంతాలను వదిలి విదేశాలకు వెళ్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల పరిధిలో ఉన్న పురాతన కట్టడాలు, వారసత్వ సంపదను మార్కెటింగ్, బ్రాండింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలను కార్యక్రమాలు చేపట్టడం, ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. తాను తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన వాడినని, అక్కడ ప్రతి నెలా ఏదో ఒక పండుగ జరుగుతుంటుందని చెప్పారు.

- Advertisement -

ఆయా పండుగలకు సంబంధించిన సరైన వీడియోలేవీ లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకున్న బడ్జెట్ లోనే 20 శాతాన్ని వీడియోలు, మార్కెటింగ్ కోసం వినియోగించాలని రాష్ట్రాల మంత్రులు, అధికారులను ఉద్దేశించి చెప్పారు. ఇందుకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదని, సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసుకోవచ్చని సూచించారు. టూరిస్ట్ యూత్ క్లబ్బుల ఏర్పాటు ద్వారా పర్యాటక రంగాభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ వర్క్ షాపులో చర్చించే అంశాలను మీ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నించాలని ఆయన కోరారు.

‘అడాప్ట్ ఎ హెరిటేజ్ పేరుతో మన వారసత్వం, మన గుర్తింపు’ పథకం ద్వారా మన చుట్టు పక్కన ఉండే వారసత్వ సంపదను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయడం ద్వారా వాటిని సంరక్షించడంతోపాటు పర్యాటకాన్ని ప్రోత్సహించినట్లవుతుందని ఆయన స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో వెలుగులోకి రాని మరెన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటి మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ వెల్లడించారు. కనెక్టివిటీ ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికీ ప్రయత్నిస్తున్నామని సీఎం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement