Thursday, May 2, 2024

Delhi: వివేకా హత్య కేసులో సీబీఐకి, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు.. అక్టోబర్ 14న తదుపరి విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఉన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 14కు వాయిదా వేసింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదని, కేసులో కీలక సాక్షులతో పాటు దర్యాప్తు చేస్తున్న అధికారులను సైతం బెయిల్ మీద బయటికొచ్చిన నిందితులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత రెడ్డి, భార్య వైఎస్ సౌభాగ్య సంయుక్తంగా సుప్రీంకోర్టులో ఈ ఏడాది ఏప్రిల్ 13న పిటిషన్ దాఖలు చేశారు.

సీబీఐ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (చీఫ్ సెక్రటరీ), ఏపీ డీజీపీని ప్రతివాదులుగా పిటిషన్లో పేర్కొన్నారు. కేసులో కీలక సాక్షులు అనుమానాస్పదరీతిలో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ కృష్ణ మురారి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. కేసులో సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

నిందితులు బెయిల్ మీద బయటికొచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సాక్షులు, దర్యాప్తు అధికారులపై బెదిరింపులు, ఒత్తిళ్లు ఉంటే విచారణ సజావుగా ముందుకు సాగదని, ఈ పరిస్థితుల్లో ట్రయల్ కోర్టులో విచారణను హైదరాబాద్ లేదా మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. అలాగే తదుపరి దర్యాప్తు ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేసులో ఇప్పటికే చార్జిషీట్లు దాఖలయ్యాయి కదా అని ధర్మాసనం ప్రశ్నించగా.. హత్య కేసు విచారణ తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరిపిందని, అనంతరం కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయగా.. చార్జిషీట్‌, అనుబంధ చార్జిషీట్ కూడా దాఖలు చేసిందని చెప్పారు.

అయితే కేసులో ఇంకా వెలికితీయాల్సిన అంశాలు ఉన్నాయని, మరికొందరి పాత్ర కూడా బయటపడుతుందని సిద్ధార్థ్ లూత్రా అన్నారు. ఈ సందర్భంగా కేసులో 240 మందికి పైగా సాక్షులున్నారని, ఏ ఒక్కరికీ బెదిరింపులు, ఒత్తిళ్లు లేవని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే నోటీసులు అందుకున్న తర్వాత తమ వాదన వినిపించాలని ధర్మాసనం సూచించింది. కేసును విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 14న జరపనున్నట్టు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement